MLC Kavitha | అబిడ్స్/జియాగూడ, ఏప్రిల్ 6: భగవాన్ శ్రీరామచంద్రుని ఆదర్శంతో భారతదేశ, తెలంగాణ ప్రజలు జీవితాన్ని గడుపుతారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆనంద్ సింగ్ ఏర్పాటు చేసిన సీతారామ లక్ష్మణుల పల్లకి సేవను ఆమె జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు హితభాషి, మితభాషి, పూర్వభాషిగా ఉండాలని అన్నారు. ఎల్లప్పుడూ తెలివిగా మాట్లాడాలని, ఇతరుల బాధను అర్థం చేసుకున్న తర్వాత తక్కువగా మాట్లాడాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి వేడుకలను ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటారని తెలిపారు. ధూల్పేటలో సీతారాముల పల్లకి ఊరేగింపులో పాల్గొనేందుకు అవకాశం తనకు లభించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్సీ కవిత శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిన్నారులకు ఆమె చాక్లెట్లను పంపిణీ చేశారు. రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ జీ కి అంటూ ఆమె పాటలు పాడి పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికిన నాయకులు
ధూల్పేటలో సీతారాముల పల్లకి ఊరేగింపు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నాయకులు ఘన స్వాగతం పలికారు. గోషామహల్ నియోజకవర్గంలో ఆనంద్ సింగ్ నిర్వహిస్తున్న ఈ పల్లకి ఊరేగింపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత విచ్చేయగా నాయకులు ఆమెకు అడుగడుగున స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి కిరీటంతో సన్మానించారు.