సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): నగరంలో ఆశ్రయం లేని వ్యక్తులు, రోడ్లపైనే నివాసముండే నిరాశ్రయులు.. అందులో మానసిక స్థితి సరిగా లేని వారు మత పరమైన ప్రదేశాలకు వెళ్తున్నారని, వీరు కొన్ని సందర్భాలలో చేసే పనులతో శాంతి భద్రతలకు ఆటంకం కలిగేందుకు అవకాశాలున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ సమస్య పరిష్కరిస్తూ, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆశ్రమాలు నిర్వహించే స్వచ్ఛంద సంస్థలు, ఆయా శాఖ అధికారులతో మంగళవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు. ఈ సందర్భంగా చర్చించిన విషయాలను వివరించారు. వీధి నివాసులు, రోడ్ల పక్కనే నివాసముండేవారు, నిరాశ్రయులైన వారు, మతిస్థిమితం లేని వారితో పాటు ర్యాగ్ పికర్స్, తాగుబోతులను గుర్తించి, వారికి తక్షణమే ఆశ్రయం కల్పిస్తూ, వారి శ్రేయస్సు కోసం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య, మానసిక ఆరోగ్య సేవలను క్రమబద్ధీకరిస్తూ, వారిలో నేరాలు చేసేవారుంటే వాటిని కట్టడి చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.
ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ప్రార్థనా మందిరాలు, మతాలకు సంబంధించిన ప్రదేశాలను గుర్తించి వాటికి జియో ట్యాగింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తూ.. సెక్టార్ ఎస్సైలు ఏరియాలో ఉన్న కమిటీ సభ్యులతో సత్సంబంధాలు కలిగి ఉంటూ ప్రార్థనా మందిరాల వద్ద సీసీ టీవీలు, ప్రహారీలు, గేట్లు లాక్ సిస్టమ్స్ సరిగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనుమానాస్పదంగా మతిస్థిమితం లేనివారు కనిపిస్తే.. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. అలాంటి వారిని దవాఖానలకు, షెల్టర్ హోమ్స్‌కు తరలించాలని సూచించారు.
నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని నిర్ణయించినట్లు సీపీ వెల్లడించారు. ఈ సమావేశంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా, నగర అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఐజీ కమలాసన్‌రెడ్డి, జైళ్ల శాఖ ఐజీ మురళీబాబు, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ రమాదేవితో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.