Srinivas Goud : దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో పామ్ బోర్డు ఏర్పాటు చేసి, పామ్ చెట్ల నుండి లభించే ఉత్పత్తులను ప్రోత్సహించాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) డిమాండ్ చేశారు. పామ్ చెట్ల నుండి బెల్లం, ఇతర ఉప ఉత్పత్తులను తయారు చేసి, వాటితో పిల్లలకు ఆరోగ్యకరమైన చాక్లెట్లు, బిస్కెట్లు.. అలాగే ఆర్గానిక్ ఆహార పదార్థాలు తయారు చేయాలని ఆయన సూచించారు.
అఖిల భారతీయ కల్వర్ కలాల్ కళార్ మహాసభకు హాజరైన శ్రీనివాస్ గౌడ్ తెలంగాణలో మాదిరిగా దేశంలోని అన్ని రాష్ట్రాలలో వైన్ షాపులలో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. రసాయన కూల్‌డ్రింక్స్‌కు బదులుగా ఆరోగ్యకరమైన పానీయాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ రంగం ప్రధానంగా కులవృత్తులపై ఆధారపడి నడుస్తున్నందున దీనిని ఒక ప్రత్యేక పరిశ్రమగా గుర్తించి, ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా రా కేఫ్‌లు, నీరా ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటుతో పాటు వైన్ షాపుల్లో రిజర్వేషన్లు, ఎక్స్‌గ్రేషియా పంపిణీ వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు శ్రీనివాస్ గౌడ్నునేపాల్ ప్రతినిధులు, అఖిల భారతీయ కల్వార్ కలాల్ కళార్ మహాసభ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి బ్లోగట్ కిశోర్ కుమార్ భగత్, అధ్యక్షుడు మనిష్ రాయ్, ప్రధాన కార్యదర్శి కిశోర్ భగత్, కోశాధికారి శివ ప్రసాద్ జైస్వాల్, తదితరులు పాల్గొన్నారు.