కేపీహెచ్‌బీ కాలనీ, ఫిబ్రవరి 15 : నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. కాలనీలు బస్తీలలో పలుచోట్ల థీమ్ పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించిన విషయం తెలిసిందే. నగరంలోని పార్కులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంలో భాగంగా థీమ్ పార్కుల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన థీమ్ పార్కులపై ప్రజల నుంచి మంచి స్పందన లభించడంతో నగరంలో మరికొన్ని చోట్ల థీమ్ పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. దీనిలో భాగంగా కూకట్పల్లి జోన్‌లోని మూసాపేట, కూకట్పల్లి సర్కిళ్ల పరిధిలో చేపట్టిన థీమ్ పనులు వేగంగా సాగుతున్నాయి.
కేపీహెచ్‌బీ కాలనీలో 2.. కూకట్‌పల్లిలో 1 థీమ్ పార్కు..
కూకట్పల్లి జోన్ పరిధిలోని మూసాపేట, కూకట్పల్లి జంట సర్కిళ్ల పరిధిలో మూడుచోట్ల థీమ్ పార్కు పనులు జోరుగా సాగుతున్నాయి. కేపీహెచ్‌బీ కాలనీ 4, 7వ ఫేజ్‌లలో 2 థీమ్ పార్కులు, కూకట్‌పల్లిలో అస్బెస్టాస్ కాలనీలో 1 థీమ్ పార్కు పనులు కొనసాగుతున్నాయి. కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్‌లో సోలార్ ఎనర్జీ థీమ్, 4వ ఫేజ్‌లో జిమ్ థీమ్, కూకట్పల్లి అస్బెస్టాస్ కాలనీలో ఎన్విరాల్మెంట్ థీమ్‌తో ప్రత్యేక పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. ఈ థీమ్ పార్కు పనులను వేగవంతంగా పూర్తిచేసేలా పనులు చేస్తున్నారు.
థీమ్ పార్కుల అభివృద్ధి..
కూకట్పల్లి జోన్ పరిధిలో ఆయా ప్రాంతాల్లో చేపట్టిన థీమ్ పార్కు పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నగరంలో ఎక్కడాలేని విధంగా కొత్త థీమ్‌లతో పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. కేపీహెచ్‌బీ కాలనీలో సోలార్ ఎనర్జీని ఉపయోగిస్తూ ప్రత్యేకంగా పార్కును అభివృద్ధి చేస్తున్నాం. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా జిమ్ పరికరాలను అందుబాటులోకి తెస్తున్నాం. పర్యావరణంపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఎన్విరాల్మెంట్ పార్కును అభివృద్ధి చేస్తున్నాం. త్వరలోనే ఈ మూడు థీమ్ పార్కులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
– వి.మమత, జోనల్ కమిషనర్, కూకట్పల్లి