Forest Lands | మేడ్చల్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): అటవీ భూములను అక్రమణల నుంచి రక్షించడానికి గొలుసు లింక్ ఫెన్సింగ్ పనులను అటవీ శాఖ అధికారులు ప్రారంభించనున్నారు. అటవీ భూములు అక్రమణలకు గురువుతున్న క్రమంలో అటవీ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టేలా ప్రణాళికలను రూపొందించారు. అటవీ భూములు అక్రమణలకు గురువుతున్నట్లు ఇటీవల అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ గొలుసు లింక్ ఫెన్సింగ్ చేపట్టేలా నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అటవీ శాఖ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. అటవీ భూములు పరిరక్షణతో పాటు పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించింది. 24 శాతం ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచింది. అటవీ భూముల పరిరక్షణకు బీఆర్ఎస్ ప్రభుత్వమే గొలుసు లింక్ ఫెన్సింగ్ పనులను ప్రతిపాదించి నిధులు మంజూరు చేయగా, ప్రస్తుతం ఆ పనులు ప్రారంభించేందుకు అటవీ శాఖ సిద్ధమవుతుంది.
జిల్లాలో 8072.46 హెక్టార్లలో విస్తీర్ణం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 8072.46 హెక్టార్ల అటవీ భూమి విస్తరించి ఉంది. విస్తీర్ణంలో మొత్తం 40 ఫారెస్ట్ బ్లాకులు ఉన్నాయి. 3,660 హెక్టార్ల విస్తీర్ణం ఉన్న 13 బ్లాక్‌లలో నీలగిరి ప్లాంటేషన్స్ ఉండగా, మిగిలిన 2,800 విస్తీర్ణంలో మిస్లేనియస్ ప్లాంటేషన్స్ ఉన్నాయి. అయితే, ఇప్పటికే అటవీ శాఖ భూములలో 17 అర్బన్ పార్కులను ఏర్పాటు చేశారు. అర్బన్ పార్క్‌ల సందర్భంగా అప్పట్లోనే గొలుసు లింక్ ఫెన్సింగులు ఏర్పాటు చేయగా, పార్కులు లేని అటవీ విస్తీర్ణంలో ప్రసుత్తం గొలుసు లింక్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో భూముల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా ఉండేలా చూస్తున్నారు. అయితే, అటవీ భూములలో మరిన్ని అర్బన్ పార్కుల ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను మంజూరు చేయగా, ఇప్పటి వరకు అర్బన్ పార్కుల ఏర్పాటుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.