సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ): కొత్తూరు ఠాణా సాక్షిగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. ఇతర ప్రాంతాల్లో ఏమైనా విక్రయాలు జరుగుతున్నాయా.. అనేదానిపై దృష్టి పెట్టారు. స్థానికంగా మరికొన్ని చోట్ల ఈ మత్తు చాక్లెట్ల విక్రయం జరుగుతుందనే వార్తలు వస్తుండటంతో ఆ దిశగా పోలీసులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగా అనుమానిత దుకాణాలు, పాన్‌షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు శంషాబాద్ జోన్ డీసీపీ కె.నారాయణరెడ్డి తెలిపారు.
కొత్తూరు పరిసరాల్లోని ఆయా కంపెనీల్లో పనిచేసే కొంత మంది కార్మికులు ఒడిశా, తదితర రాష్ర్టాల నుంచి గంజాయి వంటి మత్తు పదార్థాలతో తయారు చేసిన చాక్లెట్లు, ఇతర పదార్థాలను నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు డీసీపీ వివరించారు. ఈ మేరకు అందిన ఫిర్యాదుతో ప్రధాన నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని, నిందితులిచ్చిన సమాచారంతో కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మత్తు పదార్థాలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు గాని, లేదా 100 నంబర్‌కు గాని సమాచారం ఇవ్వాలని డీసీపీ కోరారు.
సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. మత్తు పదార్థాలు ఆరోగ్యానికే హాని చేయడమే కాకుండా.. సమాజానికి కూడా ప్రమాదకరమన్నారు. గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాలు విక్రయిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను గమనించాలన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు తీసుకున్నా..విక్రయించినా, రవాణా చేసినా జైలు తప్పదని హెచ్చరించారు. ప్రజలు ఇచ్చే సమాచారం ఎన్నో జీవితాలను కాపాడుతుందని డీసీపీ తెలిపారు.