ఎల్బీనగర్, జనవరి 27 : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకంలో కంటి పరీక్షలు చేయడంతో పాటు కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నారు. అవసరమైన వారికి కంటి శస్త్ర చికిత్సలకు రెఫర్ చేస్తున్నారు. ఎల్బీనగర్ జోన్ పరిధిలోని హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్ సర్కిళ్ల పరిధిలోని 13 డివిజన్ల పరిధిలో కంటి పరీక్ష కేంద్రాలకు కంటి పరీక్షలు చేయించుకునేందుకు లబ్ధిదారులు నిత్యం క్యూలు కడుతున్నారు. మూడు సర్కిళ్ల పరిధిలో మొత్తం 10,202 మందికి కంటి పరీక్షలు చేసి వారిలో 2525 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు పరీక్షలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అధునాతన పరికరాలను కంటి వెలుగు కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చింది. వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి కంటి అద్దాలను అందించడంతో పాటు శస్త్ర చికిత్సలకు కూడా రిఫర్ చేస్తున్నారు. కంటి పరీక్షలకు ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా పరీక్షా కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. ఎల్బీనగర్ జోన్ పరిధిలోని హయత్‌నగర్ సర్కిల్లో నాలుగు డివిజన్లకు గాను నాలుగు పరీక్షా కేంద్రాలు, ఎల్బీనగర్ సర్కిల్లోని నాలుగు డివిజన్లకు గాను నాలుగు పరీక్షా కేంద్రాలు, సరూర్‌నగర్ సర్కిల్లో ఐదు డివిజన్లకు గాను ఆరు కంటి వెలుగు పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.
ఎల్బీనగర్ సర్కిల్లోని వనస్థలిపురం, హస్తినాపురం, చంపాపేట, లింగోజిగూడ డివిజన్ల పరిధిలోని నాలుగు కేంద్రాల్లో కంటి వెలుగు పరీక్షలు జరుగుతున్నాయి. వారం రోజుల్లో 2,814 మందికి కంటి పరీక్షలు నిర్వహించి.. 778 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. అదే విధంగా కంటి శస్త్ర చికిత్సలకు 282 మందిని, ఆప్టికల్ రిఫరల్ కోసం 829 మందిని రిఫర్ చేశారు.
హయత్‌నగర్ సర్కిల్లోని నాగోలు, మన్సూరాబాద్, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ల పరిధిలోని నాలుగు కేంద్రాల్లో కంటి వెలుగు పరీక్షలు జరుగుతున్నాయి. వారం రోజుల్లో 3,439 మందికి కంటి పరీక్షలు నిర్వహించి.. 840 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. అదే విధంగా కంటి శస్త్ర చికిత్సలకు 602 మందిని, ఆప్టికల్ రిఫరల్ కోసం 895 మందిని రిఫర్ చేశారు.
సర్కిల్ సర్కిల్లోని సరూర్‌నగర్, ఆర్కేపురం (రెండు కేంద్రాలు), కొత్తపేట, చైతన్యపురి, గడ్డిఅన్నారం డివిజన్ల పరిధిలోని 6 కేంద్రాల్లో కంటి వెలుగు పరీక్షలు జరుగుతున్నాయి. 3,949 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 907 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. అదే విధంగా ఆప్టికల్ రిఫరల్ కోసం 623 మందిని రిఫర్ చేశారు.