అమీర్‌పేట్, అక్టోబర్ 17 : అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సహా కీలకమైన హామీలేమీ ఆచరణ దిశగా అడుగులు పడలేని స్థితి నెలకొందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వీధివీధికి వస్తున్న కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని శుక్రవారం ఆమె ఓటర్లకు పిలపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శు బీఆర్ఎస్ అభ్యర్థ్ధి మాగంటి సునీత గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డిలతో కలిసి ఎర్రగడ్డలోని రాజీవ్‌నగర్, నందానగర్, వెంకటేశ్వరకాలనీ, కళ్యాణ్‌నగర్, ఎర్రగడ్డ, గోకుల్ థియేటర్ పరిసరాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మాగంటి సునీత గెలుపుఖాయమన్నారు.
మణికొండ: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జీ పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి అన్నారు. ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపుకోసం మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు. శుక్రవారం షేక్‌పేట్ డివిజన్ కూడలిలోని కనకదుర్గమ్మ ఆలయం వద్ద పూజలు నిర్వహించి ప్రచార సరళిని మొదలుపెట్టిన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలెవరు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో మాత్రమే మైనార్టీల ప్రయోజనాలకు పెద్దపీట వేశారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీహరి ముదిరాజ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లో మైనార్టీ సోదరులను కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణసోందని, గత దశాబ్ద కాలంలో మైనార్టీ జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు వీలుగా మైనార్టీ పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు, యువతీ యువకుల కోసం స్వయం ఉపాధి అవకాశాలు, రంజాన్ పండుగకు దుస్తులు, సామూహిక విం దులు నిర్వహించింది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
బాలానగర్ : కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు విధానాలే బీఆర్ఎస్ గెలుపునకు నాంది పలుకుతుందని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎర్రగడ్డ డివిజన్ ఇన్చార్జి, కూకట్పల్లి ఎమ్మె ల్యే కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో కార్పొరేటర్ పాల్గొన్నారు. ఐదు బూత్‌ల నాయకులు మైనార్టీలతో కలిసి మసీద్‌ల వద్ద ప్రచారం చేశారు. ఎర్రగడ్డ, బాలానగర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మాగంటి సునీత గెలుపే లక్ష్యంగా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో జరిగిన అభివృద్ధి.. ప్రస్తుత అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
కేపీహెచ్‌బీ కాలనీ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపుకోసం కేపీహెచ్‌బీ కాలనీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డితో కలిసి ఎర్రగడ్డ డివిజన్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. అభివృద్ధిని కొనసాగించేందుకు బీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించుకోవాలని కార్పొరేటర్ ఓటర్లను కోరారు. బీఆర్ఎస్ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు జూబ్లీహిల్స్ ఎన్నికే నాంది కాబోతుందన్నారు.