Number Plates | సిటీబ్యూరో,మార్చి18(నమస్తే తెలంగాణ):వాహనదారులూ.. నంబర్ ప్లేట్స్‌తో జరభద్రం. ఇష్టమొచ్చినట్టుగా నంబర్లను రాసుకుంటే ఆర్టీఏ అధికారులకు దొరికినట్టే. జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ కూడా చేసే ప్రమాదం ఉన్నది. ఇటీవల కాలంలో చాలా మంది తమ వాహనాల నంబర్ ప్లేట్లపై ఇంగ్లిష్ అక్షరాలను పోలి ఉన్న అంకెలను అమర్చుకుంటున్నారు. మరికొందరు నంబర్లో ఒక అంకెను చెదరగొట్టి వాహనాలను తిప్పుతున్నారు. ఇంకొందరు ఒకే నంబర్ ప్లేట్‌తో రెండు వాహనాలను నడుపుతున్నారు. ఇతర రాష్ట్ర వాహనాలు సైతం అనుమతి లేకున్నా ఇక్కడి నంబర్ ప్లేట్స్ తగిలించుకుని రాష్ట్రంలో తిప్పుతున్నారు.
ముఖ్యంగా వీకెండ్లు, పండుగల రద్దీ దృష్ట్యా వైట్ నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు ప్రయాణికులను ఎక్కించుకుని ట్రిప్పులు కొడుతున్నాయి. అందులో భాగంగా రవాణా శాఖాధికారులు ప్రత్యేక బృందాలుగా తనిఖీల ప్రక్రియను ముమ్మరం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ట్రావెల్స్ బస్సులపై సైతం నిఘా పెట్టి వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఇటీవల తనిఖీల్లో 27 వాహనాలను రవాణా శాఖాధికారులు సీజ్ చేశారు. ఎంవీ యాక్ట్ 1989 ప్రకారం.. ఎంవీ యాక్ట్ 50, 51 నిబంధనల ప్రకారం.. ద్విచక్ర వాహనాలు, లైట్ మోటార్ వెహికిల్ కార్లు రిజిస్టేష్రన్ అంకెలు, అక్షరాలు కచ్చితంగా వైట్ ప్లేట్‌పై బ్లాక్ కలర్లో ఉండాలి.
కమర్షియల్ వాహనాలైతే యెల్లో ప్లేట్‌పై బ్లాక్ లెటర్స్‌తో నంబర్ ఉండాలి. రిజిస్టేష్రన్ నంబర్ రెండు వరుసల్లో ఉండాలి.స్టేట్ కోడ్ (టీజీ) అండ్ రిజిస్టేష్రన్ అథారిటీ కోడ్ తర్వాత మిగిలిన నంబర్ రెండో వరుసలో ఉండాలి. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేస్తే వెహికిల్ వివరాలతో పాటు ఓనర్ డిటెయిల్స్ మొత్తం తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. వాహనాలు దొంగతనం జరిగినా.. ప్రమాదానికి గురైనా వెంటనే వివరాలు తెలుసుకోవచ్చు.
ట్రావెల్స్ మాయాజాలం!
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా రవాణా అధికారుల బృందాలు పలు ప్రాంతాల్లో నిఘా వేసి వాహనాలను తనిఖీ చేశారు. ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసి.. రూల్స్‌కు వ్యతిరేకంగా నడుస్తున్న బస్సులను సీజ్ చేశారు. ఫిట్నెస్(వాహనసామర్థ్యం), టాక్సీ, లైసెన్స్, బీమా, ఫైర్ సేఫ్టీ, ఓవర్ స్పీడ్, పరిమితికి మించి లోడ్, హారన్ మోత, ఫస్ట్ ఎయిడ్ కిట్ తదితర వాటిని చెక్ చేశారు. కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఫైర్ సేఫ్టీ సరిగా పాటించడం లేదని అధికారులు గుర్తించారు.
నిబంధనల ప్రకారం నడుచుకోవాలి..
తనిఖీలు ముమ్మరం చేశాం. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలను సీజ్ చేస్తాం. నకిలీ నంబర్ ప్లేట్లతో వాహనాల రాకపోకలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. అతివేగంతో డ్రైవింగ్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. హెల్మెట్ ధరించడం, కారు సీటు బెల్ట్ ధరించడం, రోడ్డు నిబంధనలు పాటించాలి. వేగ సూచికలకు అనుగుణంగా వెళ్లాలి. నంబర్ ప్లేట్స్ ట్యాంపరింగ్ చేస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేస్తాం.
– రవీందర్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్