సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): నగర అంతర్గత భద్రతపై ట్రైకమిషనరేట్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హై అలర్ట్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అప్రమత్తమైన నిఘా వ్యవస్థ స్లీపర్ సెల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. అసాంఘీక శక్తులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశాలున్నందున పాతనేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రజల్లో అలజడి సృష్టించేందుకు యత్నించే దుష్టశక్తులను గుర్తించేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. అంతే కాకుండా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేస్తూ రెచ్చగొట్టడం, భయబ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించిన పోలీస్‌శాఖ ఆ దిశగా సోషల్ మీడియాను ప్రత్యేక బృందాలతో క్షుణ్ణంగా పర్యవేక్షిస్తోంది.
పాతనేరస్తులపై ప్రత్యేక నజర్..
గతంలో శాంతిభద్రతల విఘాతానికి పాల్పడిన పాతనేరస్తులు, మతకల్లోహాలకు పాల్పడిన నేరస్తుల కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులతోపాటు జైలులో ఉన్న ఖైదీలు, జైలు నుంచి విడుదలైన వారిపై సైతం నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.
రంగంలోకి షాడో బృందాలు..
దేశంలో జరిగిన ఉగ్రదాడులకు సంబంధించిన మూలాలు నగరంలో తేలిన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ట్రై కమిషనరేట్ పరిధిలో ఉగ్ర సంబంధాలున్నవారు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు వేట మొదలు పెట్టారు. ఉగ్ర సంబంధాలున్నవారితో పాటు వారి సానుభూతి పరులను గుర్తించేందుకు షాడో బృందాలను రంగంలోకి దింపినట్లు సమాచారం. గత కొంత కాలంగా హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నగరంలో నెలకొన్న శాంతి సామరస్యాన్ని చూసి ఓర్వలేని ఏవైన దుష్టశక్తులు నగరంలోకి ప్రవేశించకుండా నిఘా వ్యవస్థలు డేగ కన్ను పెట్టాయి.
తనిఖీలు ముమ్మరం..
భద్రతా చర్యల్లో భాగంగా ట్రై పోలీస్ కమిషనరేట్ పరిధిలో తనిఖీలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దులు, నగర సరిహద్దుల్లో దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నగరానికి వచ్చిపోయే వాహనాలను పోలీసులు క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
సున్నిత ప్రాంతాల వద్ద భారీ బందోబస్తు
మహానగరంలోని సున్నిత, అతి సున్నిత ప్రాంతాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రముఖ ప్రార్థనా మందిరాలు, ఆలయాలు, బహిరంగ ప్రదేశాలు, చారిత్రాత్మకమైన పర్యాటక ప్రాంతాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీ కెమెరాలతో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలి ఇండోర్‌స్టేడియంలో జరుగుతున్న ప్రపంచ అందాల పోటీల నేపథ్యంలో స్టేడియం చుట్టూ కేంద్ర, రాష్ట్ర బలగాలతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా ఇప్పటికే ఈ పోటీలు జరిగే ప్రాంతంలో డ్రోన్లపై నిషేధం విధించిన పోలీసులు తాజాగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ 10కిలో మీటర్ల దూరం వరకు డ్రోన్లపై నిషేధం విధించారు.