సిటీబ్యూరో, డిసెంబరు 4 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు.. ఎన్నికలు జరిగే గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ పరిధిల్లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అన్ని జోన్ల డీసీపీలు కసరత్తు చేస్తున్నారు. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా రాయకీయ పార్టీలపై ప్రత్యేక నజర్ పెట్టారు. ముఖ్యంగా ఓటర్లను డబ్బు, మద్యం, బహుమతులు వంటి వాటితో మభ్యపెట్టకుండా నిఘా పెట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఎన్నికల్లో ఎలాంటి అవాంతరాలు, గొడవలు చోటుచేసుకోకుండా ఎన్నికలు జరిగే సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టడంతోపాటు ఆయా ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్, రాజేంద్రనగర్, బాలానగర్, మేడ్చల్ మాదాపూర్ జోన్ల అధికారులు ఎన్నికలు జరిగే సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు. గురువారం శంషాబాద్ జోన్ పరిధిలోని షాద్‌నగర్‌లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. మొగిలిగిద్ద, ఎల్లంపల్లి, చౌలపల్లి, కిషన్‌నగర్ గ్రామాల్లో షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మినారాయణ, షాద్‌నగర్ ఠాణా సీఐ విజయ్‌కుమార్, 50మంది పోలీసులతో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు.