Electricity Bills | సిటీబ్యూరో, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ): గ్రేటర్లో విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. మూడు సర్కిళ్లలో రూ.122 కోట్లు పెండింగ్ బిల్లులు ఉండడంతో వీటి వసూళ్లపై దక్షిణ డిస్కం దృష్టిపెట్టింది. మార్చినెల నుంచి ఎండలు ముదిరితే విద్యుత్ వినియోగం మరింత పెరిగే పరిస్థితి ఉండడంతో అంతకుముందే పెండింగ్ బిల్లులు వసూలు చేయడానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. వాస్తవానికి ఎప్పటికప్పుడు బిల్లులు జారీ చేసి, రెవెన్యూ కలెక్షన్ చేయాల్సిన ఇంజినీర్లు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొంది.
ఫిబ్రవరి 1 నాటికి గ్రేటర్ సర్కిళ్ల పరిధిలో 62 లక్షలకు పైగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక కనెక్షన్లు ఉండగా, వీటిలో రంగారెడ్డి జోన్లో 2,84,902 సర్వీసులు, మెట్రో జోన్లో 3,94,763 సర్వీసులు, మేడ్చల్ జోన్లో 2,24,816 సర్వీసులు విద్యుత్ బిల్లులు బకాయిలు పడ్డాయి. ఈ మేరకు అకౌంట్స్ విభాగం వంద శాతం రెవెన్యూ కలెక్షన్స్ లక్ష్యంగా ప్రతీ నెలా డి(డిస్కనెక్షన్) లిస్ట్ తయారు చేసి క్షేత్రస్థాయి ఇంజినీర్లకు అందిస్తోంది. వీరు ఎప్పటికప్పుడు ఆయా వినియోగదారుల వద్దకు వెళ్లి పెండింగ్ బిల్లులు వసూలు చేయాల్సి ఉండగా ఆ పరిస్థితి లేకపోవడంతో భారీగా బకాయిలు పేరుకుపోయాయి.
సౌత్ సర్కిల్లోనే ఎక్కువ పెండింగ్..
మెట్రో జోన్ నుంచి రూ.72.32 కోట్లు రావాల్సి ఉంది. రంగారెడ్డి జోన్ నుంచి రూ.38.28 కోట్లు, మేడ్చల్ జోన్ నుంచి రూ.12 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ సౌత్ సర్కిల్ నుంచే రూ.51.06 కోట్లు రావాలి. సర్కిళ్ల వారీగా పెండింగ్ బిల్లులు చూస్తే.. రాజేంద్రనగర్లో రూ.22.58 కోట్లు, హైదరాబాద్ సెంట్రల్లో రూ. 16.16 కోట్లు, సైబర్సిటీలో రూ.7.70 కోట్లు, వికారాబాద్లో రూ. 5.45 కోట్లు, సంగారెడ్డిలో రూ. 4.28 కోట్లు, హబ్సిగూడలో రూ. 4.04 కోట్లు, మేడ్చల్లో రూ.3.73 కోట్లు, సరూర్నగర్లో రూ. 2.55కోట్లు, సికింద్రాబాద్లో రూ.2.05 కోట్లు ఉన్నాయి. వసూళ ్లకోసం డ్రైవ్ నిర్వహించాలని సంస్థ ఆదేశించినప్పటికీ.. ఇంజినీర్లు పెద్దగా దృష్టిపెట్టడం లేదు. క్షేత్రస్థాయి సిబ్బంది కేవలం మీటర్ రీడింగ్కే పరిమితమవుతున్నారు.
క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు..
విద్యుత్ బిల్లుల బకాయిల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఎల్టీకి సంబంధించి మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్లలో కలిసి రూ.122 కోట్ల బకాయిలు ఉండగా.. వీటి వసూలుకు ఏఈ నుంచి చీఫ్ ఇంజినీర్ వరకు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలలలో విద్యుత్ డిమాండ్ పెరిగి బిల్లులు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో ఈ లోపే పెండింగ్ బిల్లుల్లో కనీసం 80 శాతం వసూలు చేయాలని లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత మూడు నెలలుగా బిల్లులు చెల్లించని వినియోగదారులపై దృష్టిపెట్టారు. వచ్చే నెలతో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో ఈలోపే బకాయిల వసూళ్లపై సీరియస్గా దృష్టిపెట్టినట్లు అధికారులు చెప్పారు. వచ్చేనెలలో కూడా ప్రత్యేక డ్రైవ్ ఉంటుందని తెలుస్తోంది. వినియోగదారులు బకాయిలు చెల్లించి సహకరించాలని వారు కోరారు. బకాయిల వసూళ్లతోపాటు డిస్టిబ్య్రూషన్ ట్రాన్స్ఫార్మర్ల నుంచి వెళ్లే ప్రతీయూనిట్ను బిల్లింగ్ పరిధిలోకి తీసుకువచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ నెలా నమోదవుతున్న విద్యుత్ డిమాండ్, రికార్డవుతున్న యూనిట్ల లెక్కలు తీస్తూ ఎనర్జీ ఆడిట్ నిర్వహిస్తున్నారు. పెండింగ్ బిల్లుల వసూళ్లే లక్ష్యంగా ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సిబ్బంది మొత్తం పనిచేస్తున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు.