GHMC | సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ)/మల్కాజిగిరి : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న హాస్టల్స్ క్యాంటీన్లలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో 12 రెసిడెన్షియల్ విద్యాలయాలు, హాస్టళ్లను తనిఖీ చేశారు. ఎల్బీనగర్లో ఒకటి, చార్మినార్‌లో 4, ఖైరతాబాద్‌లో ఒకటి, శేరిలింగంపల్లిలో రెండు, కూకట్‌పల్లిలో ఒకటి, సికింద్రాబాద్ జోన్లలో మూడింటిని తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా వంటగది, వంట సామగ్రి, వాటర్ ట్యాంక్స్, స్టోరేజ్ ఏరియా, తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్, రా మెటీరియల్, పారిశుధ్య నిర్వహణ తదితర వాటిని ఫుడ్ సేఫ్టీ అధికారుల అధికారులు పరిశీలించారు. నిబంధనలు పాటించని వాటికి షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు హెచ్చరించారు.
ఈ తనిఖీలు 15 రోజుల పాటు నిర్వహించనున్నారు. బుధవారం మల్కాజిగిరిలోని బ్రౌన్ బేర్ బేకరీలో కుళ్లిపోయిన బర్గర్ అమ్మారని వినియోగదారుడు ఆరోపించారు. ఈ విషయం పై అతడు సర్కిల్ అధికారులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన అధికారులు బేకరీకి వచ్చి పరిశీలించారు. పాడైన బర్గర్‌ను చూసి ధృవీకరించారు. బేకరీలో తనిఖీలు చేసి అనుమానం ఉన్న ఆహార పదార్థాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపిస్తామని తెలిపారు.
ఫుడ్ కోర్టుల్లో తనిఖీలు చేపట్టండి
టెలీకాన్ఫరెన్స్‌లో కమిషనర్ ఆమ్రపాలి
సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఆహార పదార్థాల నాణ్యతపై తనిఖీలు నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అదనపు, జోనల్ కమిషనర్లతో కమిషనర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆహార పదార్థాలు తయారీ చేస్తున్న కేంద్రాలను తనిఖీ చేయాలని, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులు, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఫుడ్ సెంటర్లు, హాస్టల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో దోమల నివారణపై యాంటీ లార్వా ఆపరేషన్ చేపట్టాలని, చుట్టూ ఫాగింగ్ చేయాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణ తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.
జలమండలి ఈడీగా మయాంక్ మిట్టల్
సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ): జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మయాంక్ మిట్టల్ బాధ్యతలు స్వీకరించారు. నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం రెండు రోజుల క్రితం జలమండలి ఈడీగా నియమించింది. ఈ మేరకు బుధవారం ఆయన ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఎండీ అశోక్‌రెడ్డిని ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. జలమండలి ఉన్నతాధికారులు, ఉద్యోగులు నూతన ఈడీకి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.