Medchal | మేడ్చల్, జూలై 7 (నమస్తే తెలంగాణ): అనాథలు, బాల కార్మికుల గుర్తింపునకు శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఆపరేషన్ ముస్కాన్-10 పేరిట పిల్లల భవిత వారి భరోసాకు ఈ నెల చివరి వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో 14 ఏండ్ల లోపు ఉన్న అనాథలు, బాల కార్మికులు, నిరాశ్రయులైన పిల్లలు అక్రమ రవాణాకు గురవుతున్న బాల బాలికలు, భిక్షాటన చేస్తున్న పిల్లలను స్పెషల్ డ్రైవ్ ఆపరేషన్ ముస్కాన్ ద్వారా గుర్తించనున్నారు. గుర్తించిన పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించడం లేదా అనాథ శరణాలయాల్లో చేర్పించనున్నట్లు శిశు సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్-10 కార్యక్రమానికి సంబంధించి చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న బాల బాలికలు, బాలికలు ఎక్కడైనా అక్రమ రవాణాకు గురవుతున్నట్లు తెలిస్తే.. చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098కు సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకోనున్నారు. ఈ నంబర్ 24 గంటలు పని చేస్తుందని అధికారులు తెలిపారు. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ కమిటీని శిశుసంక్షేమ శాఖ ఏర్పాటు చేసింది. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ముందే గుర్తించిన ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి బాలకార్మికులు, భిక్షాటన చేస్తున్న వారిని గుర్తిస్తుంది. బాల కార్మికులతో పని చేయించుకుంటున్న యజమానులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల చివరి వరకు డ్రైవ్‌ను నిర్వహించి పిల్లలకు భరోసానిచ్చేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. టాస్క్‌ఫోర్స్ కమిటీలో వివిధ విభాగాల అధికారులను భాగస్వాములను చేశామని తెలిపారు.