సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): : ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ నగర ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నది. చిత్ర విచిత్రమైన నియమాలు, నిబంధనలు ఉండటంతో ఎన్యూమరేటర్లతో పాటు ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. బీఎల్వోలకు సరైన శిక్షణ ఇవ్వకపోవడంతో ఫారాలను ఎలా నింపాలో ప్రజలకు సమగ్రంగా వివరించలేక సతమతమవుతున్నారు. కొన్ని చోట్ల ఫారాలిచ్చి అందులో ఉన్న ప్రకారం నింపుకోండని చెప్పి వెళ్లిపోతున్నారు. మరికొన్ని చోట్ల ఇప్పటిదాకా బీఎల్వోలు ఫారాలే ఇవ్వకపోవడం ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
చాలా ప్రాంతాల్లో బీఎల్వోలు ఒకే దగ్గర ఉండి ఆ ప్రాంతంలోని ఓటర్లందరినీ అక్కడికే వచ్చి ఫారాలు తీసుకోవాలని ఆదేశిస్తున్నారు. దీంతో పనులు మానుకుని గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. ప్రక్రియ ప్రారంభమై పది రోజులు దాటుతున్నా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ బీఎల్వోలు క్షేత్రస్థాయిలోకి వెళ్లడంలేదు. ఫారాలు పంపిణీ చేయడంలో పూర్తి జాప్యం జరుగుతున్నది. ఎన్నికల సంఘం అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించకపోవడంతో బస్తీల్లో సర్ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
2002లో ఓటు ఉన్నవారికి కష్టాలు తప్పడం లేదు. అప్పుడున్న బూత్ వివరాలు తెలియకపోవడం, అప్పటి వ్యక్తిగత వివరాలు.. ఇప్పటి వివరాలకు పొంతన లేకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్కో చోట ఒక్కో సమస్యతో ఓటర్లు ఆయోమయానికి గురవుతున్నారు. ఒక నిర్ధిస్టమైన విధానం లేకపోవడంతో తమ ఓటు కోల్పోతామేమోనని ఆందోళన చెందుతున్నారు.
మలక్‌పేట: డోర్ టు డోర్ తిరిగి దరఖాస్తు ఫారాలను అందజేసి, పూరిచేసిన దరఖాస్తులను పరిశీలించి తిరిగి సేకరించాల్సిన బీఎల్ఓలు, కాలనీ సంక్షేమ సంఘాల భవనాలు, కమ్యూనిటీహాళ్లలో బల్క్‌గా అప్పగించి పంపిణీ చేయాలని వారికి సూచిస్తున్నట్లు చెబుతున్నారు. శిక్షణ పొందిన బీఎల్ఓలు, బీఎల్ఏల్లో కొందరికీ అర్థమైందని, కొందరికీ అర్థం కాలేదని, అర్థం కానివారు తమను అడిగి సలహాలు తీసుకుంటున్నారని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బీఎల్ఓ లే పేర్కొంటుండటం గమనార్హం. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు స్టేనో, ఆపై స్థాయి అధికారులతో ఈ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, జీహెచ్ఎంసీలో జూనియర్ అసిస్టెంట్లుగా, కిందిస్థాయి సిబ్బందిగా పనిచేస్తున్న ఉద్యోగులకు, ఆశా వర్కర్లకు శిక్షణను ఇచ్చి నిర్వహిస్తుండడం గమనార్హం.

రామంతాపూర్: ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారమ్‌లను బీఎల్వోలు ఇంటింటికి తిరిగి ఓటర్లకు అందించాలి. కానీ అలా ఇవ్వడంలేదు. కేవలం రాజకీయ నాయకులు ఉన్న దగ్గరకు మాత్రమే వెళ్లి అక్కడ గుమిగూడి అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, ఓటర్లకు మాత్రమే ఈ ఫామ్‌లను అందిస్తున్నారు. కొన్ని చోట్ల అసలు ఫామ్స్ కూడా ఇవ్వడంలేదు. మరికొన్ని ఇండ్లు, అపార్ట్మెంట్ల వాళ్లకు ఇంకా ఏం ఇవ్వడంలేదని ఓటర్లు ఆందోళనకు గురవుతున్నారు. 2002 ఓటరు జాబితాలో పేరు ఉన్న ఓటర్లకు సంబంధించిన వివరాలు పూర్తిగా ముద్రించి ఇవ్వకుండా, కేవలం ఓటర్ ఐడీ వివరాలు మాత్రమే ఇచ్చి, బాక్స్ నం. 1ను ఖాళీగా ఉంచడం వల్ల ఓటర్లు ఇబ్బందులు ఎదురొంటున్నారు. రామంతాపూర్‌లోని అన్ని కాలనీల్లో బీఎల్వోలు ఇంటింటికి తిరిగి సర్‌పై అవగాహన కల్పించడంతోపాటు ఫారంలు అందిస్తే బాగుంటుంది.
గోల్నాక: క్షేత్ర స్థాయిలో సర్వే చేస్తోన్న బీఎల్వోలకు ఓటర్ల అడ్రస్ దొరకడం గగనంగా మారింది. ఇంటి నంబర్ల గందరగోళం, కొత్త పాత ఇండ్ల నంబర్ల మార్పుల వల్ల ఎన్యూమరేషన్ ఫారాలు ఎవరిగి ఇవ్వాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా 2002 నాటి ‘సర్’లో పేర్లు లేని వారు తల్లిదండ్రుల వివరాలతో సరిపోల్చడం పెద్ద సమస్యగా మారింది. ఈ సాంకేతిక, క్షేత్రస్థాయి సమస్యలు అధికారులు వెంటనే పరిష్కరించాలని అంబర్‌పేట నియోజకవర్గం ఓటర్లు కోరుతున్నారు.
ఉప్పల్: ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారంలో 2002 ఓటరు జాబితాలో పేరు ఉన్న ఓటర్లకు సంబంధించిన వివరాలు పూర్తిగా ముద్రించి ఇవ్వకుండా, కేవలం ఓటర్ ఐడీ వివరాలు మాత్రమే ఇచ్చి, బాక్స్ నం. 1ను ఖాళీగా ఉంచడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదురొంటున్నారు. ప్రస్తుతం 2002 ఓటరు జాబితాలోని భాగం (పార్ట్)సంఖ్య, ఓటరు క్రమ సంఖ్య (సీరియల్ నంబర్), నియోజకవర్గ సంఖ్య వంటి వివరాలను స్వయంగా వెతికి ఫారంలో నమోదు చేయాల్సి వస్తోంది. ..మిగతా IIవ పేజీలో
అంబర్‌పేట: బాగ్‌అంబర్‌పేట రామకృష్ణనగర్‌కు చెందిన అబ్దుల్ రఫీక్ 2002లో మహేశ్వరం నియోజకవర్గం ఎర్రకుంటలో నివాసముండే వారు. అక్కడే ఓటు ఉంది. అంబర్‌పేటకు మార్పించుకున్నా మారలేదు. బీఎల్ఓలు ఎర్రకుంటలోనే ఎన్యుమరేషన్ఫారం ఇచ్చారు. అది తెలుగులలో ఉంది. ఆయన ముస్లిం కావడంతో చదవడానికి రావడం లేదు. ఇంగ్లిష్ లేదా ఉర్దూలో ఫారం ఇస్తే బాగుంటుందని అతను అభిప్రాయపడ్డారు. 2002లో ఉన్న డాటా కూడా దొరకడం లేదు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ప్రధానంగా ఫారం నింపడం ఎవరికీ అర్థం కావడం లేదు.
మేడ్చల్: మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు-కిష్టాపూర్ డివిజన్లోని కిష్టాపూర్ 88, 89 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. 88 పోలింగ్ బూత్‌లో 1120 మంది ఓటర్లు ఉండగా 750 వరకు ఎన్యుమరేషన్ పత్రాలను పంపిణీ చేశారు. 89 బూత్‌లో 1105 మంది ఓటర్లు ఉండగా 500 వరకు ఎన్యుమనరేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన పత్రాలు కూడా వివిధ పార్టీల నాయకులు సహకారంతో పంపిణీ చేశారు. పత్రాలను పంపిణీ ఇలా ఉంటే పూర్తి చేసిన పత్రాలను తిరిగి ఇచ్చింది మాత్రం రెండు అంకెలకు మించలేదు. అవగాహన లేమితో ఓటర్ల పూరించి ఇవ్వడం లేదు. ప్రక్రియ ఇలాగా కొనసాగితే 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు గల్లంతవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఘట్కేసర్: ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో బీఎల్వోల నిర్లక్ష్యవైఖరి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నది. ఉన్నతాధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి లోపాలను సరిదిద్ది ప్రజలకు భరోసా కల్పించాలి. కొంత మంది బీఎల్వోలు ఫారాల వివరాలు అడిగితే సరైన సమాధానాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 2002 సంవత్సరానికి సంబంధించిన ఓటరు నమోదు వివరాలు పాత ఆధారాలు సమర్పించాలని కోరడం వల్ల అనేక మంది యువ ఓటర్లు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల బీఎల్వోలు ఇంటికి వెళ్లకుండా ఫోన్ల ద్వారానే సమాచారం ఇవ్వడం, కొంతమంది ఇండ్లకు ఫారాలు అందజేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో ఒకే కుటుంబ సభ్యుల పేర్లు వెర్వేరు జాబితాల్లో చూపించడం, ఫారాల్లో తప్పులు ఉండటం, వాటిని సరిచేసేందుకు సరైన మార్గదనిర్దేశం లేకపోవడం గందరగోళం నెలకొంటున్నది. ఫారాలు స్వీకరించినట్లు ఎలాంటి రసీదు ఇవ్వకపోవడం వల్ల ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమర్పించిన పత్రాల భద్రత పైనా సందేహలు నెలకొంటున్నాయి. బూత్‌ల వద్ద సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ లేదా స్పష్టమైన సమాచార వ్యవస్థ లేకపోవడం కూడా ప్రజల ఇబ్బందులను మరింత
పెంచుతున్నది.
కుత్బుల్లాపూర్: ఓటు కార్డులో మార్పులు చేర్పులు, నివాసం మారిన వారు సమర్పించాల్సిన ఫామ్-8 పత్రాలు బీఎల్ఓల వద్ద లభ్యం కాకపోవడం గమనార్హం. ఓటు వివరాల్లో తప్పులను సరిదిద్దుకుందామని వస్తున్న పౌరులకు ఫారాలు లేవు అనే సమాధానం ఎదురవడంతో వారు తీతవ్ర అసహనానికి గురవుతున్నారు. ఓటర్ల సర్వే ప్రక్రియ పర్యవేక్షణ లోపించిందనేది స్పష్టమవుతున్నది. వాస్తవానికి ఈ సర్వేలో బీఎల్ఓలు ప్రతి ఓటరు ఇంటి తలుపు తట్టి వివరాలు సేకరించాలి. కానీ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో బీఎల్ఓలు, బీఎల్ఏలు కాలనీల్లో తిరగడం మాని, ఏదో ఒక నిర్దిష్ట ప్రాంతాల్లో, ఒకే చోట కూర్చొని మమ అనిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దీనివలన ఓటర్ల వద్దకు చేరాల్సిన అధికారిక ఫారాలు అసలు అందడం లేదు. తమ ఓటు ఉందో లేదో సరిచూసుకునేందుకు ఓటర్లు స్వయంగా బీఎల్ఓల వద్దకు వెళ్లాల్సి వచ్చినా అక్కడ ఫారాలు గందరగోళంగా ఉండడంతో వెనుతిరుగుతున్నారు. ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించి, బీఎల్ఓలు ఖచ్చితంగా ఇంటింటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, తగనన్ని ఫామ్-8 పత్రాలను అందుబాటులో ఉంచి ఓటర్ల గందరగోళానికి తెరదించాలని స్థానిక ప్రజలు, రాజకీయ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.