ఆమె..నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు నిత్యం ఇంటి పనుల్లో మునిగిపోతుంది. కుటుంబ ఆరోగ్యమే తన లక్ష్యంగా పనిచేస్తుంది. కుటుంబం బాగు కోసం తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయదు. అలాంటి మహిళ నేడు రక్తహీనత, వివిధ రకాల క్యాన్సర్ రోగాలు, థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడుతుంది. నేటికి ఎంతో మంది తల్లులు ఈ తరహా అనారోగ్య సమస్యలతో బయటికి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి మహిళా ఆరోగ్యవంతంగా ఉండాలనే లక్ష్యంతో ప్రతి ఏడాది మే 28న ‘ప్రపంచ మహిళల ఆరోగ్య దినోత్సవాన్ని’ ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి.
KCR | సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పాలనలో మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసిన కేసీఆర్ మహిళల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గర్భిణులకు న్యూట్రీషన్ కిట్, ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాలైన వారికి కేసీఆర్ కిట్, తల్లిబిడ్డలను ఇంటికి క్షేమంగా చేర్చే అమ్మఒడి వాహనాలు వంటి పథకాలన్నీ కేసీఆర్ అమలు చేసినవే. మహిళల ఆరోగ్యమే ధ్యేయంగా బీఆర్ఎస్ సర్కారు 2023లో ఆరోగ్య మహిళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా జిల్లాలోని యూపీహెచ్సీలు, బస్తీ దవాఖానల్లో ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మూత్రనాళాల ఇన్ఫెక్షన్, గర్భాశయ వ్యాధులు, లైంగిక మార్గంలో సంక్రమించే వ్యాధులు, మోనోపాజ్, థైరాయిడ్, మూడు రకాల (ఓరల్, బ్రెస్ట్, సర్వికల్)క్యాన్సర్ వ్యాధి, రక్తహీనత, బీపీ, షుగర్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఉచితంగా చికిత్సనందిస్తున్నారు. రోగం ముదిరినట్లు తెలిస్తే వారిని వెంటనే గాంధీ, ఉస్మానియా, కింగ్ కోటి ఆసుపత్రులకు రిఫర్ చేస్తుండటం గమనార్హం.
హైదరాబాద్లో నుంచి నేటివరకు వివిధ సమస్యలతో 3,32,506 మంది మహిళలు యూపీహెచ్సీలు, బస్తీ దావఖానల్లో చేరి పరీక్షలు చేయించుకున్నారు. జిల్లాలోని 53 యూపీహెచ్సీలు, 35 బస్తీ దావఖానల్లో ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా ప్రతి మంగళవారం నిర్వహిస్తున్నారు. ఒక్కో సెంటర్కు ప్రతినెలా 60 మంది వరకు మహిళలు వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ.వేలల్లో ఖర్చు అయ్యే ఈ పరీక్షలను యూపీహెచ్సీలు, బస్తీ దావఖానల్లో ఉచితంగానే చేస్తున్నారు.
సత్ఫలితాలిస్తున్న ఆరోగ్య మహిళ..
జిల్లాలో ఆరోగ్య మహిళా కార్యక్రమం మంచి ఫలితాలనిస్తుంది. ఆశాలు, ఏఎన్ఎంలు, మెడికల్ అధికారులు బాధితులను గుర్తించి పరీక్షలు నిర్వహించడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. రోగాన్ని ముందుగానే గుర్తించి వైద్యమందించడంలో పురోగతిలో ఉన్నాం.
– డాక్టర్ జయమాలిని, జిల్లా ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్