North City Metro | సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ ) : పునాదులు పడేంత వరకు నార్త్ సిటీ మెట్రో ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రభుత్వం మూడు నెలల్లో డీపీఆర్ తయారు చేయాలని ఆదేశించినా… మెట్రో నిర్మాణంలో పునాదులే అత్యంత కీలకమని చెబుతున్నారు. ఈ క్రమంలో హెచ్ఎంఆర్ఎల్ డీపీఆర్ సిద్ధం చేసినా… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనులు మొదలుపెట్టేంత వరకు ఉద్యమించాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులను కలుస్తూ డీపీఆర్ ప్రాధాన్యత, మెట్రో నిర్మాణంలో ప్రభుత్వ సహకారం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూనే, తమ ప్రాంతానికి మెట్రో నిర్మాణానికి మేడ్చల్ మెట్రో సాధన సమితి కృషి చేస్తూనే ఉంది.
గడిచిన ఏడాదిన్నర కాలంగా మెట్రో నిర్మాణంలో మేడ్చల్ మెట్రో సాధన సమితి విశేషంగా కృషి చేస్తున్నది. అన్ని పార్టీలు, స్థానిక కమ్యూనిటీలతో సామాజిక ఉద్యమ స్ఫూర్తిగా నార్త్ సిటీ మెట్రో అభివృద్ధికి ముందుకు సాగుతున్న క్రమంలో గల్లీ నుంచి ఢిల్లీ స్థాయిలో సామాజిక పోరాటం తరహాలో మెట్రో కోసం ఉద్యమించింది. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందించే వరకు ఒత్తిడి చేయగా… అదే తరహాలో మెట్రో నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన పునాదులు పడేంత వరకు ఉద్యమించాలని భావిస్తున్నది. డీపీఆర్ సిద్ధం చేసినా.. మెట్రో నిర్మాణంలో జాప్యానికి తావులేకుండా ఉండేలా పోరాటం కొనసాగించనున్నారు.
దశల వారీగా..
ఫేజ్-2 పార్ట్ బీలో ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, జేబీఎస్ నుంచి తూంకుంట వరకు మెట్రో నిర్మించేలా డీపీఆర్ సిద్ధమవుతున్నా… ప్రాజెక్టు పనులు మొదలయ్యేంత వరకూ నిష్క్రమించొద్దని వాదనలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు కూడా దశల వారీగా ప్రాధాన్యత క్రమంలో మెట్రో నిర్మించే యోచనలో ఉంది. తొలి దశలోనే తమ ప్రాంతానికి అవసరమైన మెట్రో పనులు మొదలయ్యేంత వరకు ఉద్యమ కార్యాచరణను రూపొందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అప్పుడే తమ ప్రాంతానికి లబ్ధి జరుగుతుందంటున్నారు. లేదంటే ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో చేపట్టే సరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుందని, అలాంటి జాప్యానికి తావు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు మార్గాల్లోనే మెట్రో నిర్మాణం ముఖ్యపాత్రను పోషిస్తున్న నేపథ్యంలో… పనులు పూర్తయ్యేంత వరకు మెట్రో నిర్మాణంపై స్థానికుల్లో అవగాహన కల్పించనున్నారు.
ఎల్బీ నగర్ – హయత్‌నగర్ రూట్లో మెట్రో స్టేషన్లు ఇవే..
కొత్తగా నిర్మించనున్న ఎల్బీ నగర్-హయత్ నగర్ మార్గంలో మెట్రో స్టేషన్లపై మెట్రో సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ మార్గంలో ఏర్పాటు చేయనున్న స్టేషన్లను ఇప్పటికే డీపీఆర్‌లో పొందుపరచగా… తాజాగా వాటికి సంబంధించిన మెట్రో మ్యాపును మెట్రో సంస్థ విడుదల చేసింది. ప్రతిపాదిత మెట్రో కారిడార్-8లో భాగంగా ఎల్బీ నగర్ నుంచి హయత్‌నగర్‌కు 7.1 కిలోమీటర్ల మేర విస్తరించనుండగా, ఇందులో ఎల్బీనగర్, చింతల్‌కుంట, వనస్థలిపురం, ఆటోనగర్, లెక్చరర్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, హయత్ నగర్ ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా మియాపూర్ నుంచి పటాన్‌చెరూ వరకు 13.4 కిలోమీటర్లు పూర్తి అయితే గనుక… హయత్‌నగర్ నుంచి పటాన్‌చెరూ వరకు మొత్తం 50 కిలోమీటర్ల మేర పొడువైన మెట్రో లైన్ అందుబాటులోకి రానున్నది.