సిటీబ్యూరో: నగరంలో విద్యుత్ స్తంభాలపై వేలాడుతూ ప్రమాదకరంగా మారిన కేబుళ్ల తొలగింపు ప్రక్రియను ఎస్పీడీసీఎల్ చేపట్టింది. ఈ కేబుళ్లను తొలగించాల్సిందిగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అనేకసార్లు కేబుల్ ఆపరేటర్లతో సమావేశాలు నిర్వహించినా ఫలితం లేకపోవడంతో దక్షిణ డిస్కం చొరవ తీసుకుంది.
సీఎండీ ముషారఫ్ అలీ ఆదేశాల మేరకు సిబ్బంది స్తంభాలపై 15 అడుగుల కన్నా కిందికి వేలాడుతున్న కేబుళ్లను తొలగించే ప్రక్రియను మొదలుపెట్టారు. సీఎండీ చెప్పినప్పటికీ కొందరు ఆపరేటర్లు స్పెషల్ డ్రైవ్ చేపట్టి అనవసర కేబుళ్లను తొలగించినా, మరికొందరు పెద్దగా పట్టనట్లు ఉండటంతో కేబుళ్లు ప్రమాదకరంగా మారి అత్యవసర విద్యుత్ మరమ్మతులకు ఆటంకంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో కేబుళ్ల తొలగింపునకు చర్యలు చేపట్టినట్లు ఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు.