సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరం ఓఆర్ఆర్ను దాటి వేగంగా విస్తరిస్తోంది. దీంతో పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా అత్యవసర సర్వీసుల్లో ఒకటైన విద్యుత్ సరఫరాను విస్తరిత ప్రాంతాలకు అందించడంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) విఫలమవుతోంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్ డిమాండును ముందుగానే అంచనా వేసి క్షేత్ర స్థాయిలో మెరుగైన రీతిలో విద్యుత్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. సబ్ స్టేషన్లు మొదలు కొని, 11 కేవీ ఫీడర్ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, ఎల్ టీ లైన్లను వేశారు. దీంతో అడిగిన వెంటనే విద్యుత్ కనెక్షన్ ఇచ్చి, నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా నెట్‌వర్క్‌ను తీర్చిదిద్దారు.
కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ సరఫరాపై నిర్లక్ష్యం వహిస్తున్నది. దాని ఫలితమే గత వేసవి నుంచి మొదలు కొని వర్షాకాలం వరకు తరచూ విద్యుత్ కోతలు, అంతరాయాలతో నగర వాసులు ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం విద్యుత్ డిమాండుకు అనుగుణంగా నెట్‌వర్క్‌ను విస్తరించకపోవడమే. డిస్కం కొన్ని నెలల క్రితం చేపట్టిన ఫీడర్ల సర్వేలోనూ అప్పటికే వినియోగంలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్పై ఓవర్ లోడ్ పెరిగిందని గుర్తించింది. దానికి వెంటనే శాఖా పరంగా నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచాల్సింది పోయి, విద్యుత్ వినియోగదారులపైనే భారం వేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నది.
నగర శివారు ప్రాంతాల్లోనే విద్యుత్ డిమాండు గణనీయంగా పెరిగింది. సైబర్ సిటీ సర్కిల్, రాజేంద్రనగర్, మేడ్చల్, హబ్సిగూడ, సరూర్‌నగర్, సంగారెడ్డి సర్కిళ్లలో కొత్తగా నివాసాలతో పాటు పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. వాటికి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేలా క్షేత్ర స్థాయిలో లేకపోడంతో జారీ చేయడం లేదు. ముఖ్యంగా అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు, వ్యక్తిగత గృహాలు కోర్ సిటీ కంటే శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటున్నాయి. శివారు జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోనే డిమాండు ఎక్కువగా ఉంటోందని విద్యుత్ శాఖ అధికారులే చెబుతున్నారు.
సైబర్ సిటీ సర్కిల్ పరిధిలో సుమారు 92 ప్రాంతాల్లో కొత్తగా 11కేవీ ఫీడర్ లైన్లు వేయాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు. ఇలా శివారు సర్కిళ్లలో రాజేంద్రనగర్, సరూర్‌నగర్, మేడ్చల్, సంగారెడ్డి సర్కిళ్లలో వందల సంఖ్యలో ఫీడర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు కొత్తగా వేల సంఖ్యలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికైనా డిస్కం ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో అత్యవసరమైన విద్యుత్ నెట్ వర్క్‌ను ఏర్పాటు చేయాలని శివారు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
1.హైదరాబాద్ సెంట్రల్
2. హైదరాబాద్ సౌత్
3.సికింద్రాబాద్
4.బంజారాహిల్స్
5.సైబర్ సిటీ
6. రాజేంద్రనగర్
7.సరూర్‌నగర్
8.హబ్సిగూడ
9.మేడ్చల్
10.సంగారెడ్డి