బన్సీలాల్ పేట్, జూన్ 17 : రైల్వే ఉద్యోగులు, కార్మికులు అంకితభావంతో పనిచేయడం వల్ల దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచి, ఉత్తమ ఫలితాలు సాధించిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ 113వ జనరల్ కౌన్సిల్ సమావేశం సికింద్రాబాద్ లోని రైల్ కళారంగ్ ఆడిటోరియంలో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన జీఎం మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఉద్యోగులు మరింత కష్టపడి పని చేయాలని ఆయన సూచించారు. ఎన్ ఎఫ్ ఐ ఆర్ జాతీయ కార్యదర్శి, దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్రి రాఘవయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏకీకృత పెన్షన్ విధానం, కొత్త పెన్షన్ విధానాలను తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
పాత పెన్షన్ పద్ధతి అమలు చేసే వరకు తాము న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. 8వ పే కమిషన్ ప్రకటించిన కేంద్రం ఇప్పటివరకు దానికి చైర్మన్ ను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. రైల్వేలో కార్మికులకు కనీస వేతనం 60 వేల రూపాయలు ఉండాలని, రైల్వేలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఈ సమావేశంలో తీర్మానించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జూన్ నెలాఖరున పదవీ విరమణ చేయబోతున్న జీఎం అరుణ్ కుమార్ ను ఎంప్లాయిస్ సంఘ్ తరఫున ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ సిద్ధార్థ్ కటి, ఎంప్లాయిస్ సంఘ్ సంయుక్త కార్యదర్శి భరణి భాను ప్రసాద్, జోనల్ అధ్యక్షుడు ప్రభాకర్ ఆండ్రుస్, ఎజీఎస్ లు రుద్రారెడ్డి, రవూఫ్, దక్షిణమధ్య రైల్వే లోని అన్ని డివిజన్ల నుండి పెద్ద ఎత్తున ప్రతినిధులు హాజరయ్యారు.