ఖైరతాబాద్, జూలై 22: ప్రమాదవశాత్తు, అనారోగ్యంతో మరణించిన కొందరు అవయవదానంతో మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. జీవన్‌దాన్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీభూషణ్ రాజు వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం, అక్కినేపల్లి గ్రామానికి చెందిన బండికిరణ్ (34) పశువైద్యుడు. రెండు సంవత్సరాలుగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నాడు.
ఈ నెల 17న బీపీ పెరగడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ దవఖానలో చేర్పించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు ఈ నెల 21న బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. కుటుంబ సభ్యులను కలిసిన జీవన్‌దాన్ ప్రతినిధులు అవయవదానం విశిష్టతను వివరించగా, అందుకు అంగీకరించారు. ఆయన శరీరం నుంచి కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలను సేకరించారు.
మరో ఘటనలో…
రామంతాపూర్ నెహ్రూనగర్‌కు చెందిన కలకుంట్ల వేణుగోపాల్ (55) సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) శాఖ ఉద్యోగి. ఈ నెల 19న ఒక్కసారిగా వాంతులు, తలనొప్పితో అపస్మారక స్థితిలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించగా, చికిత్స అందిస్తున్న వైద్యులు ఈ నెల 21న బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. జీవన్‌దాన్ కో ఆర్డినేటర్ కౌన్సిలింగ్ మేరకు అవయవదానానికి అంగీకరించారు. ఆయన శరీరం నుంచి కాలేయం, ఊపిరితిత్తులు, రెండు మూత్రపిండాలను సేకరించారు.