Hyderabad | బంజారాహిల్స్, ఏప్రిల్ 21: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు అక్రమార్కులు కుట్రలు పన్నుతున్నారు. నవ నిర్మాణ నగర్లో ఖాళీగా ఉన్న ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని తమ సొసైటీలో కలుపుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది గమనించిన స్థానికులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఆ స్థలాన్ని కాపాడాలని జీహెచ్ఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే..షేక్‌పేట మండల పరిధిలోని సర్వే నెంబర్ 403లోకి వచ్చే జూబ్లీహిల్స్ రోడ్ నెం 1 ప్రధాన రహదారిలోని డీఈ షా సంస్థ భవనం వెనకాల సుమారు 300 గజాల ప్రభుత్వ స్థలం చాలా ఏళ్లుగా ఖాళీగా ఉంది. ఈ స్థలానికి ఒకవైపు జూబ్లీహిల్స్ సొసైటీకి చెందిన స్థలంలో ఏర్పాటైన భారతీయ విద్యాభవన్ స్కూల్స్ , రెండోవైపున నవనిర్మాణనగర్ కాలనీ ఉంటుంది. ఈ స్థలంలోకి వెళ్లడానికి నవ నిర్మాణనగర్లో నుంచి మాత్రమే రోడ్డు ఉంది. నవ నిర్మాణ్నగర్లోని జీహెచ్ఎంసీ ట్రీ పార్కును అనుకుని ఉన్న ఈ స్థలం గురించి అక్కడి వారికి తప్ప బయటివారికి తెలియదు. కాగా కొంతమంది పేదలు సుమారు మూడేండ్లుగా అక్కడ గుడిసెలు వేసుకుని నివాసం ఉండేవారు. అయితే ఇటీవల కాలనీకి చెందిన కొంతమంది పెద్దలు వారిని ఖాళీ చేయించారు. ఈ స్థలం కాలనీకి చెందినదని దబాయించారు. దీంతో వారంతా అక్కడ నుంచి రెవెన్యూ ఆఫీసుకు వెళ్లగా ఈ ఖాళీ స్థలం ప్రభుత్వానిదే అని తేలింది.
ఇదిలా ఉండగా వారం రోజుల నుంచి స్థలాన్ని కాపాడుతున్నామనే నెపంతో కాలనీకి చెందిన కొంతమంది గేటు ఏర్పాటు చేశారు. లోనికి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ట్రీ పార్కు పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని క్రీడా మైదానంగా మార్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నవ నిర్మాణ్‌నగర్ సొసైటీకి సంబంధం లేని ఈ ప్రభుత్వ స్థలాన్ని కాలనీవాసులు ఎలా కలుపుకుంటారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఈ స్థలంలో రెవెన్యూశాఖ అధికారులు వెంటనే ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కాలనీలో గ్రీన్ బెల్ట్, ఓపెన్ స్థలాలుగా లే అవుట్లో చూపించిన కొన్ని స్థలాలను ప్లాట్లుగా మార్చుకుని అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి. కాగా తమ సొసైటీకి సంబంధం లేని సుమారు రూ. 10కోట్ల విలువైన రెవెన్యూ స్థలాన్ని కూడా అక్రమించుకోవడానికి ప్రయత్నించడం సరికాదని జూబ్లీహిల్స్ డివిజన్‌కు చెందిన నాయకులు అంటున్నారు.