Hayath Nagar | హయత్ నగర్, ఏప్రిల్ 28 :గొర్రెల మందకు కాపలాదారులుగా పడుకున్న ఓ ఇద్దరి వ్యక్తులపై దోపిడి దొంగలు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గొర్రెల మంద కాపలాదారు, కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. మరొక వ్యక్తి స్వల్పoగా గాయపడ్డారు. గొర్రెల మంద నుండి 30 గొర్రెలను దొంగలు అపహరించారు. ఈ సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది.
హైదరాబాద్ శివారు తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడ గ్రామానికి చెందిన రాసురి నవీన్ (29) కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని తండ్రి శ్రీశైలానికి 250 గొర్రెలు ఉన్నాయి. కొంతకాలంగా శ్రీశైలం ఆరోగ్యం బాగోలేకపోవడంతో చికిత్స నిమిత్తం ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. తండ్రి ఆస్పత్రిలో ఉండటంతో ఆ గొర్రెలకు కాపలాగా పడుకునేందుకు శ్రీశైలం స్థానంలో నవీన్, అతని బావమరిది శ్రీకాంత్‌తో కలిసి ఆదివారం రాత్రి వెళ్లాడు.
సోమవారం తెల్లవారుజామున దాదాపు 3.30 గంటలకు 20- 25 వయసున్న 10 మంది దుండగులు బొలెరో వాహనంలో గొర్రెల మంద వద్దకు వచ్చారు. వచ్చి రాగానే నవీన్, అతని బావమరిది నుంచి సెల్ఫోన్లు, వాళ్ల వద్ద ఉన్న రూ.5వేలు లాక్కున్నారు. ఈ క్రమంలోనే నవీన్‌పై కత్తులతో దాడిచేసి, 30 గొర్రెలను బొలెరో వాహనంలో ఎక్కించుకుని పరారయ్యారు.తీవ్ర గాయాలైన నవీన్, శ్రీకాంత్ కలిసి గ్రామంలోకి వెళ్లి గ్రామస్తుల సహాయంతో డయల్ 100కి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న హయత్‌నగర్ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన నవీన్, శ్రీకాంత్‌ను కామినేని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనలో నవీన్ కుడి కన్ను, తల, కుడి భుజం వెనుక తీవ్రగాయాలయ్యాయి. శ్రీకాంత్ కుడి కన్ను, ఇతర భాగాల్లో గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వ్యక్తులు హిందీలో మాట్లాడినట్లుగా నవీన్ పోలీసులకు చెప్పాడు. దీని ఆధారంగా హయత నగర్ ఇన్స్పెక్టర్ పి.నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది బృందాలుగా విడిపోయి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఓఆర్ఆర్ సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.