సిటీబ్యూరో, జూన్ 24(నమస్తే తెలంగాణ): కన్నవాళ్లే కాలయములవుతున్నారు.. ప్రేమకు అడ్డొస్తున్నారని కన్న తల్లులనే కాటేస్తున్నారు.. ప్రేమ మోజులో పడి తల్లిని చంపేంత కాఠిన్యాన్ని నింపుకుంటూ..తమ ప్రియుడితో కలిసి హత్యలు చేస్తున్నారు. ఇందులో మైనర్లు, యువకులు, వయస్సు మళ్లిన వారు సైతం ఉం డడం ఆందోళన కల్గిస్తోంది. ఇలాంటి వారు హత్యలు చేసేందుకు ఇంటర్నెట్లో యూట్యూబ్‌ను ఆశ్రయిస్తున్నారు. జీడిమెట్లలో ప్రేమకు అడ్డొస్తుందని బాలిక, తన ప్రియుడు, అతని సోదరుడితో కలిసి కన్న తల్లిని కడతేర్చిన దిగ్భ్రాంతికర ఘటనతో సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
నవమోసాలు మోసి పెంచిన కన్నపిల్లలే.. తమ ప్రేమ కోసం.. తల్లులపై కత్తి దూస్తున్నారు. పాఠాలు నేర్చుకోవల్సిన వయస్సులో ఇంటర్నెట్కు బానిసై చెడు అలవాట్లకు గురవుతూ విచక్షణ కోల్పోతూ కన్న తల్లులను కత్తులతో పొడిచేస్తున్న ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు చాలావరకు సోషల్‌మీడియా వేదికగా ప్రారంభమవుతున్నాయి. అదే సోషల్‌మీడియా వ్యాయమోహంలో పడుతూ కొందరు పిల్లలు మొండిగా మారుతూ హత్యల వరకు వెళ్తున్నారు.
తల్లులను హతమార్చిన కొన్ని ఘటనలు..
జీడిమెట్లలో పదో తరగతి చదువుతున్న బాలిక.. తన ప్రియుడు, అతని సోదరుడితో కలిసి కన్న తల్లి అంజలిని కిరాతంగా చంపేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయిన నల్గొండకు చెందిన శివ(19)తో ప్రేమలో పడింది. దానికి తల్లి నిరాకరించడంతో ఆమెను అడ్డు తొలగించుకోవడానికి ఫ్లాన్ చేశారు. ఇందులో భాగంగా బాలిక, ఆమె ప్రియుడు శివ, అతని సోదరుడు(మైనర్)తో కలిసి అంజలి గొంతుకోసి హత్య చేసిన ఘటన నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.
లాలాగూడలో నివాసముండే సుశీలకు ముగ్గురు కుమార్తెలు జ్ఞానేశ్వరి, లక్ష్మి, ఉమామహేశ్వరి, ఒక కొడుకు శివ. ఇందులో ఎవరికీ వివాహం కాలేదు. కొడుకు ఆమెరికాలో ఉంటున్నాడు. సుశీల భర్త మృతి చెందడంతో కారుణ్య నియామకం కింద ఆమె కూతురు లక్ష్మి(40)కి రైల్వేలో సహాయకురాలిగా ఉద్యోగం వచ్చింది. వీళ్లంతా కొన్నాళ్ల క్రితం వరకు లాలాగూడలో నివాసముంటుండగానే జవహర్‌నగర్‌లో ఒక ఇంటిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే తల్లి సుశీల, ఉమామహేశ్వరి జవహర్‌నగర్‌లో ఇంట్లో ఉంటుండగా జ్ఞానేశ్వరి, లక్ష్మి లాలాగూడలో ఉంటున్నారు.
ఇదిలాఉండగా లాలాగూడలో ఉంటున్న సమయంలో యూపీకి చెందిన మేస్త్రీ పనిచేసే అరవింద్‌కుమార్‌తో ఆ కుటుంబానికి పరిచయం ఏర్పడిం ది. అతనికి వివాహం అయి, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇంటికి తరుచుగా వచ్చే అరవింద్‌కుమార్‌తో లక్ష్మి ప్రేమలో పడింది. ఇద్దరి మధ్య వాహేతర సంబంధం కొనసాగుతుందనే అనుమానంతో తల్లి సుశీల, సోదరి జ్ఞానేశ్వరి పలుమార్లు వారించింది. ఈ విషయం లో ఇంట్లో గొడవలు కూడా జరిగాయి. తన ప్రేమకు సోదరి, తల్లి అడ్డొస్తోందని ఆ ఇద్దరిని హతమార్చాలని లక్ష్మి, అరవింద్ స్కెచ్ వేశా రు. ఇందులో భాగంగా ఈ ఏడాది మార్చి 1న లాలాగూడ ఇంట్లో ఒంటరిగా ఉన్న జ్ఞానేశ్వరిని హత్యచేసి మూటగట్టి రైల్వే క్వార్టర్స్‌లోని ఒక సంప్‌లో పడేశారు.
ఆ తరువాత జవహర్‌నగర్‌లో నివాసముండే సుశీల వద్దకు వెళ్లారు. దోపిడీ దొంగ లు వచ్చి దోపిడీ చేసినట్లు అక్కడ సీన్ క్రియేట్ చేసి, సుశీలను హత్య చేసి ఆమె ఇంట్లో నగలు, నగదుతో దొంగిలించి పరారయ్యారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుశీల హత్య కేసు దర్యాప్తు లో కూతురు లక్ష్మి, తన ప్రియుడు అరవింద్‌తో కలిసి ఫ్లాన్ చేసినట్లు వెల్లడయ్యింది. విచారణలో సోదరిని కూడా హత్య చేసినట్లు తేలింది. యూట్యూబ్‌లో చూసి ఈ జంట హత్యలకు ప్రేమికులు ఫ్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడయ్యింది.
హయత్‌నగర్‌లో నివాసముండే రామన్నపేటకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి, రజిత కూతురు కీర్తి డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ తప్పుటడుగులు వేసింది. ఒక తప్పు చేసి, దాన్ని కప్పి పుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తూ తల్లి అడ్డుగా ఉందని ఆమెను ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటన 2019లో సం చలనం సృష్టించింది. బీటెక్ చేసిన బాల్‌రెడ్డి, కీర్తి మైనర్‌గా ఉన్నప్పుటి నుంచి ప్రేమలో పడ్డారు. ఆమెకు అ బార్షన్ కూడా చేయించాడు. ఇందు కు పక్కింట్లో ఉండే శశికుమార్ సహాయం చేశాడు.
ఆ తర్వాత శశికుమార్.. ఆమెను బ్లాక్మెయిల్ చేసి లోబర్చుకున్నాడు. దాంతో పాటు డబ్బులు కూడా డిమాండ్ చేశాడు. చిట్టీలు వేసే తల్లివద్ద డబ్బులుంటాయని ఆమెను హత్య చేసి డబ్బులు తీసుకోవాలని ప్రియుడితో కలిసి ఫ్లాన్ చేశారు. ఇందులో భాగంగా తల్లి రజితను హత్య చేశారు. ఆ తరువాత కుటుంబ సభ్యులకు పొం తన లేని సమాధానాలు చెప్పింది. చివరకు పోలీసుల విచారణలో తల్లిని హత్య చేసింది తానేనని ఒప్పుకుంది. దీంతో కీర్తితో పాటు ఆమె ప్రియుడు, మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.