చర్లపల్లి, డిసెంబర్ 14:జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పంచాక్షరిలు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాలభాస్కర్రావుతో కలిసి ప్రారంభించారు. జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా ఇరువై నాలుగు బెంచిలను ఏర్పాటు చేసి 456 సివిల్ కేసులు, 1,59,476 అన్ని రకాల క్రిమినల్ కేసులు, 381 ఫ్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ మాట్లాడుతూ కక్షిదారులకు సమన్యాయంతో పాటు సత్వర న్యాయం అందించేందుకు జాతీయ లోక్ అదాలాత్ ఎంతగానో ఉపయోగపడుతుందని, కక్షిదారులు పట్టుదలకు పోకుండా రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకొవాలని ఆయన సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కర్‌రావు మాట్లాడుతూ రాజీ మార్గమే రాజ్య మార్గమని, కేసులను సత్వరమే పరిష్కరించేందుకు జాతీయ లోక్ అదాలాత్ ఎంతగానో ఉపయోగపడుతుందని, జాతీయ లోక్ అదాలాత్కు మంచి స్పందన వచ్చిందన్నారు. లోక్ అదాలాత్లో 13.1కోట్ల పరిహారం చెల్లించామని ఆయన పేర్కొన్నారు.
ఈ లోక్ ఆదాలాత్లో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కిరణ్‌కుమార్, 1వ అదనపు న్యాయమూర్తి రఘునాధ్‌రెడ్డి, జిల్లా అదనపు న్యాయమూర్తి విక్రం, కుషాయిగూడ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ మహేశ్, వివిధ కోర్టుల న్యాయమూర్తులు, బార్ అసోసియెషన్ అధ్యక్షుడు అమరేందర్రెడ్డిలతో పాటు న్యాయవాదులు, కక్షిదారులు, పోలీస్‌సిబ్బంది, బ్యాంక్, బీఎన్‌ఎస్‌ఎల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.