ఖైరతాబాద్, ఏప్రిల్ 21 : పెండింగ్ బిల్లులతో సతమతమవుతున్న కాంట్రాక్టర్ల కష్టాలు తీర్చాలని జాతీయ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి. శ్రీనివాస్ గౌడ్, కె. వెంకటేశ్వర రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సోమవారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులలో కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా వాటికి సంబంధించిన బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వ తాత్సారం చేయడం విచారకరమని అన్నారు.
ఒప్పంద నిబంధనల్లోనూ కాంట్రాక్టర్లకు అన్యాయమే జరుగుతోందని, లిక్విడ్ డామేజులు, పెనాల్టీల భారమంతా వారిపైనే వేస్తున్నాని వారు అన్నారు. ఒకే పనికి అనేక శాఖల అనుమతులు కావాల్సి ఉంటుందని, దీంతో లైసెన్సులు పొందడంలోనూ ఆలస్యమవుతుందని తెలిపారు చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లు పన్నుల భారం భరించలేకకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే కాంట్రాక్టర్ల సమస్యలపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి, సహాయ కార్యదర్శి రాజేశ్ బోయ, కోశాధికారి నాయకోటి శ్రీధర్ రావు, శ్రీనివాస్, రాజాబాబు తదితరులు పాల్గొన్నారు.