సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): పోలీసులకు అనుమానం రాకుండా ఏకంగా పాల ప్యాకెట్ల రూపంలో యథేచ్ఛగా కల్లును విక్రయిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. గుండ్లపోచంపల్లి అయోధ్యనగర్ ప్రాంతంలో శంకర్ గౌడ్ అనే వ్యక్తి హోటల్ నిర్వహిస్తున్నాడు. తన హోటల్లో తిను బండరాలతో పాటు ఎస్వీఎస్ బ్రాండ్ పేరుతో ఉన్న కల్లు ప్యాకెట్లను కూడా విక్రయిస్తున్నాడు.
ఈ మేరకు సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు సదరు హోటల్‌పై దాడులు జరిపి, 270 లీటర్ల కల్లు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఎస్వీఎస్ కల్లు ప్యాకెట్లను ఎక్కడి నుంచి తీసుకువచ్చారని పోలీసులు ప్రశ్నించగా, నిందితుడు సమాధానం ఇవ్వడం లేదని తెలిసింది. దీంతో కేసును తదుపరి విచారణ కోసం మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.