శేరిలింగంపల్లి, డిసెంబర్ 26 : ఔటర్ సర్వీస్‌రోడ్డుపై ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ నెల 22న రాత్రి 1.30 గంటలకు నానక్‌రాంగూడ టోల్గేట్ సమీపంలో ఔటర్ రింగ్‌రోడ్డు సర్వీస్‌రోడ్డుపై సాఫ్ట్వేర్ ఇంజినీర్ వెంకటరమణారెడ్డి(26), బీటెక్ విద్యార్థిని శివానీలు బైక్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన స్కోడాకారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివానీ అక్కడికక్కడే మృతి చెందగా వెంకటరమణారెడ్డికి తీవ్ర గాయాలు కాగా.. మదీనగూడలో ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడిది కామారెడ్డి నిజాంసాగర్. ఈ మేరకు పోలీసులు వెంకటరమణారెడ్డి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించి.. కేసు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా వేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన నగరంలోని ఓ ప్రముఖ డాక్టర్ కుమారుడు శ్రీకాలేశ్ను పోలీసులు అరెస్టు చేశారు.
శామీర్‌పేట, డిసెంబర్ 26 : ప్రైవేటు కంపెనీ బస్సు ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఈ సంఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… మూడుచింతలపల్లి మండలం, కొల్తూర్ గ్రామానికి చెందిన నల్ల గణేశ్(23) జగ్గంగూడలోని ఆల్ఫామెడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా కేశవరం శివారు ప్రాంతం వద్దకు రాగానే ప్రైవేటు కంపెనీకి చెందిన బస్సు( టీఎస్07యూఈ8562) ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన యువకుడిని ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.