Software Engineer | శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 17 : మామిడికాయల కోసం తోటలోకి వెళ్లి విద్యుదాఘాతానికి గురై సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందిన సంఘటన గురువారం శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి మండలం కుతుకులూరు గ్రామానికి చెందిన కె. చేతన్‌రెడ్డి(27) నగరంలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. ఆరు నెలల కిందట వివాహం చేసుకొని తాళ్లగడ్డ ప్రాంతంలో నివాసముంటున్నారు.
అయితే చేతన్‌రెడ్డి తన భార్యను పోటీ పరీక్ష రాయించేందుకు గురువారం మొయినాబాద్ మండలం భాస్కర ఇంజినీరింగ్ కళాశాలకు తీసుకెళ్లాడు. పరీక్ష ముగిసిన తర్వాత రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం భార్య స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామ శివారులో గోనేల యాదయ్య ముదిరాజ్‌కు చెందిన పొలంలో మామిడిచెట్లు కనిపించాయి.
దీంతో వారిద్దరూ వెళ్లి మామిడి కాయలు కావాలని అక్కడ ఉన్న వారిని అడిగి లోపలికి వెళ్లి కాయలు తెంపుకొని తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ప్రహరీ లోపల ఉన్న ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగిలి చేతన్‌రెడ్డి షాక్‌కు గురై కిందపడిపోయాడు. దీంతో అతడి భార్య చూసి పెద్దగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న కొందరు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే సదరు వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. తాను పలుమార్లు సీపీఆర్ చేసినప్పటికీ కదలడం లేదని చేతన్‌రెడ్డి భార్య పేర్కొన్నారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.