శేరిలింగంపల్లి, జూలై 15: గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏండ్లుగా బెంగళూరులో ఉద్యోగం చేసి రెండు నెలల క్రితమే నగరంలోని ఐటీ కంపెనీలో చేరిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తాను పనిచేస్తున్న ఐటీ కంపెనీ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు చెందిన తిరువీది వి.అవినాశ్(40)కు జ్యోతితో 2018లో వివాహమైంది. వివాహ అనంతరం భార్యాభర్తలు ఉద్యోగ రీత్యా బెంగళూరులో ఉండగా ఇద్దరు కుమారులు జన్మించారు.
అయితే అవినాశ్ ఉద్యోగం హైదరాబాద్‌కు మారడంతో రెండు నెలల క్రితమే నగరానికి వచ్చి కూకట్‌పల్లిలో నివాసముంటున్నారు. అవినాశ్ నాలెడ్జ్ సిటీలోని క్వాల్కామ్ భవనంలోని హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తాను ఇంటికి వస్తున్నట్లు భార్య జ్యోతికి మెసేజ్ చేసిన అవినాశ్ అనంతరం అందుబాటులో లేకుండా పోయాడు. అవినాశ్ వద్ద రెండు ఫోన్లు ఉండగా, ఓ ఫోన్ స్విచ్చాఫ్ రావడం, మరో ఫోన్ ఎంతకూ లిఫ్ట్ చేయకపోవడంతో అతడి భార్య కార్యాలయ మేనేజర్‌కు ఫోన్ చేయగా 6 గంటలకే కంపెనీ నుంచి వెళ్లినట్లు తెలిపాడు. దీంతో జ్యోతి అమీర్‌పేటలో ఉండే తన సోదరుడు అరుణ్‌కుమార్‌కు సమాచారం అందించింది. వెంటనే అతడు రాత్రి 8:30 గంటల సమయంలో క్వాల్కామ్ భవనం వద్దకు వెళ్లాడు.
అదే సమయంలో భవనం వద్ద ఉద్యోగులు గుమిగూడి ఉండటం, ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడంతో సంఘటనా స్థలానికి వెళ్లిన అరుణ్‌కుమార్‌కు అవినాశ్ మృతదేహం కనిపించింది. అవినాశ్ 5వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఐటీ కంపెనీ నిర్వాహకులు రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించగా, వారు చేరుకుని అవినాశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా అవినాశ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.