గ్రేటర్ ప్రజలకు ప్రయాణం మరింత సులభం చేసేందుకు మెట్రోను తీసుకొచ్చారు. కానీ భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణికులతో మెట్రో రైలు కిక్కిరిసింది. మెట్రో సౌకర్యంగా లేదని.. తోసుకుంటూ ఎక్కుతున్నామని.. కనీసం నిలబడటానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డామని ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ మెట్రోలో ఎనిమిది కోచ్‌లుంటే.. మన హైదరాబాద్‌లో మెట్రో రైలును మూడు కోచ్‌లకే ఎందుకు పరిమితం చేశారంటూ ప్రయాణికులు ఎల్ అండ్టీని ప్రశ్నించారు. రద్దీగా ఉన్న సమయంలో మెట్రో రైళ్లలో ఇరుక్కొని ప్రయాణం చేస్తున్న ఫొటోలను నేరుగా సోషల్ మీడియా ద్వారా ఎల్ అండ్ టీ మెట్రో, సీఎంఓలకు పోస్టు చేసినా ఫలితం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు అదనపు మెట్రో కోచ్‌లను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): కిక్కిరిసిన రద్దీతో హైదరాబాద్ మెట్రో సౌకర్యవంతంగా లేదు…ట్వీట్ చేసిన ఓ మెట్రో ప్రయాణికుడు. ఒక్కసారి రద్దీ సమయంలో మాతోపాటు ప్రయాణించి చూడండి. మరో ప్రయాణికుడి ఘాటైన ట్వీట్… ఢిల్లీ మెట్రోలో 8 కోచ్‌లు… మరీ హైదరాబాద్ మెట్రో 3 కోచ్‌లకే ఎందుకు పరిమితం చేశారు.? ఇలా మెట్రో ప్రయాణికులు ఎల్ అండ్ టీ మెట్రోను నిత్యం సోషల్ మీడియా వేదికగా ట్వీట్లతో ప్రశ్నిస్తున్నారు.
గ్రేటర్లో ప్రజా రవాణా వ్యవస్థలో కచ్చితమైన సమయానికి గమ్య స్థానానికి చేర్చేలా మెట్రో రైలు ప్రయాణం నగర వాసులకు అందుబాటులో ఉంది. నగరం ఒక చివర నుంచి మరో చివరకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతుంది. గంటలోపే గమ్య స్థానానికి చేరుస్తుందని మెట్రోను ఆశ్రయిస్తున్న నగర వాసులకు మెట్రో ప్రయాణం తీవ్ర ఇబ్బందిగా మారింది. ఆర్టీసీ సిటీ బస్సుల్లో ఉండే రద్దీని మించి మెట్రో రైళ్లలో ఉండటంతో నిలబడటానికి కూడా స్థలం లేదు. మెట్రో రైలు ఎక్కే సమయంలోనూ తోసుకుంటూ ఎక్కాల్సి వస్తోందంటూ’ మెట్రో కార్యకలాపాలపై ప్రయాణికులు గరం గరంగా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా మెట్రో సేవలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు
ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు గానీ, నిర్వహణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు ప్రయాణికుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. రద్దీగా ఉన్న మెట్రో రైళ్లలోనే ఇరుక్కొని ప్రయాణం చేస్తున్న ఫొటోలను నేరుగా సోషల్ మీడియా ద్వారా ఎల్ అండ్ టీ మెట్రో, సీఎంఓలకు పోస్టు చేసినా ఫలితం ఉండటం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా మెట్రో కోచ్‌ల సంఖ్యను పెంచాల్సిన ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు.