Hyderabad | హైదరాబాద్ : ఓ యువకుడి జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ పేలిపోయింది. దీంతో ఆ యువకుడి తొడకు తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌లో వెలుగు చూసింది.
అత్తాపూర్‌కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు వివో కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నాడు. ఇక తన ప్యాంటు జేబులో పెట్టుకుని నడక కొనసాగిస్తుండగా.. అది ఒక్కసారిగా పేలిపోయింది. మంటలు రావడంతో అతని తొడకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శ్రీనివాస్ పెయింటర్‌గా పని చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.