GHMC | సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ ): గ్రేటర్ హైదరాబాద్లో చెత్త సమస్య జఠిలంగా మారింది. గార్భేజ్ ఫ్రీ సిటీనే లక్ష్యమని జీహెచ్ఎంసీ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా పేరుకుపోయిన చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. ప్రధాన రహదారుల నుంచి గల్లీ రోడ్ల దాకా చెత్త పేరుకుపోతున్నది. తరచూ చెత్త వేసే ప్రాంతాలు (గార్భేజి వనరేబుల్ పాయింట్లు/జీవీపీ)లో చెత్త లేకుండా చేసేందుకు అధికారులు మళ్లీ తెరపైకి బిన్ల (చెత్త డబ్బాలు)ను అందుబాటులోకి తెచ్చారు.
ఆరు జోన్ల పరిధిలో 477 జీవీపీ పాయింట్లను గుర్తించి 931 బిన్లు ఏర్పాటు చేస్తూ కమిషనర్ ఇలంబర్తి నిర్ణయం తీసుకున్నారు. ఒక్కొక్కటి 1100 లీటర్ల సామర్థ్యం గల బిన్లు జీవీపీ సెంటర్ల వద్ద ఏర్పాటు చేయనున్నారు. అడ్వాన్స్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఆర్ఎఫ్ఐడీ విధానంలో పర్యవేక్షణ జరగనుంది. 70 శాతం బిన్లులో చెత్త పడగానే ఆర్ఎఫ్ఐడీ సెన్సార్ ద్వారా ఆ రూట్లో ఉన్న స్వచ్ఛ వాహనాన్ని (లిఫ్టింగ్ చేసే వాహనం) అలర్ట్ చేస్తుంది. దీంతో అటుగా వెళ్లే వాహనం ద్వారా ఈ బిన్లలోని చెత్తను క్లియర్ చేయనున్నారు. తద్వారా గతంలో మాదిరిగా జీవీపీ పాయింట్ల వద్ద కుక్కలు, పశువులు చిందర వందర చేసే అవకాశాలు ఉండవని అధికారులు తెలిపారు.