సిటీబ్యూరో, జనవరి 28(నమస్తే తెలంగాణ): మహా నగరంలో మంగళవారం జరిగిన ప్రమాదాలతో ఒక్కసారిగా నగర పౌరులు ఉలిక్కిపడ్డారు. ర్యాష్, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో నలుగురు మృత్యువాత పడగా, ఇద్దరు గాయపడ్డారు. బీజేపీ ఆదివారం సాయంత్రం నిర్వహించిన ‘భారతమాతకు హారతి’ సందర్భంగా హుస్సేన్ సాగర్‌లో టపాసులు కాల్చుతుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఒకరు దవాఖానాలో చికిత్స పొందుతూ మృతి చెందగా, మరొకరి కోసం హుస్సేన్‌సాగర్‌లో రెండు రోజులుగా గాలింపు చేపట్టడంతో శవమై కనిపించాడు. ఇలా నగరంలో జరిగిన ప్రమాదాలతో యువకులు మృతి చెందడంతో ఆయా కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. సోమవారం రాత్రి జగ్నేకి రాత్ సందర్భంగా ప్రార్ధనలలో పాల్గొన్న ముగ్గురు మైనర్లు బహుదూర్‌పురా, ఆరాంఘర్‌ల మధ్య ఇటీవల ప్రారంభమైన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను ఢీకొట్టి ప్రమాదానికి గురై మృతి చెందారు. బైక్‌పై తండ్రితో కలిసి స్కూల్‌కు వెళ్తున్న 5వ తరగతి విద్యార్థిని వెనుక నుంచి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
ఒక్కరోజే ఆరుగురు..!
మంగళవారం ఒక్కరోజే నగరంలో ఆరుగురు మృతి చెందారు. రాత్రి వేళల్లో రోడ్లు ఖాళీగా ఉండటంతో మైనర్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్న మైనర్లు వేగంగా వెళ్లడంతో బైక్‌ను అదుపు చేయలేక ప్రమాదానికి గురై ఉంటారని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ద్విచక్ర వాహనంపై తండ్రితో కలిసి వెళ్తున్న విద్యార్థిని పైకి లారీ దూసుకెళ్లి మృత్యువడిలోకి చేర్చింది. బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నెక్లెస్ రోడ్డులో ‘భారత మాతకు హారతి’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం అనంతరం, పడవల్లో క్రాకర్స్ తీసుకొని హుస్సేన్‌సాగర్ మధ్యలోకి వెళ్లి కాల్చుతున్నారు. ఇంతలో నిప్పురవ్వలు ఎగిరి టాపాసులు ఉన్న పడవలో పడటంతో ప్రమాదం జరిగి అక్కడున్న టపాసులు అంటుకున్నాయి. ప్రాణాలు దక్కించుకోవడం కోసం రెండు పడవల్లో ఉన్న వారు హుస్సేన్‌సాగర్‌లో దూకారు. అందులో ఒకరు తీవ్ర గాయాలకు గురై దవాఖానాలో చికిత్స పొందగా, మరొక యువకుడు గల్లంతయ్యాడు, అతని ఆచూకీ కోసం హుస్సేన్‌సాగర్‌లో వెతకడంతో మంగళవారం అతని మృతదేహం బయటపడింది.