ఇష్టానుసారం తిరగొద్దు.. మంచిగా చదువు కోవాలంటూ.. తల్లిదండ్రులు తమ ఇద్దరు కూతుళ్లకు నచ్చచెప్పారు. అయినా.. వారిలో మార్పు రాకపోవడంతో మందలించారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ అక్కాచెల్లెళ్లు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన బాలాపూర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకున్నది.
బడంగ్పేట్, జూన్ 21: ఇష్టానుసారంగా తిరగవద్దు, మంచిగా చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించగా మనస్తాపం చెందిన అక్కాచెల్లెళ్లు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ సుధాకర్ కథనం ప్రకారం.. ఏపీ, నెల్లూరు జిల్లా, ఉదయగిరి గ్రామానికి చెందిన వెంకటేశ్, రమణమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు.
ప్రస్తుతం బాలాపూర్ మండలం, మల్లాపూర్లో నివాసం ఉంటున్నారు. పెద్ద కూతురు వినీల ( 17) ఇంటర్ సెకండియర్, అఖిల ( 15) ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. గతంలో వెంకటేశ్ బెంగళూరులో పనిచేయగా.. బాలాపూర్ మండలంలోని రక్షణ శాఖలో కాంట్రాక్ట్ వర్క్ రాగా మూడు నెలల కిందట ఇక్కడికి వచ్చారు. కాగా.. ఇద్దరు కూతుళ్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో తల్లిదండ్రులు కొన్ని రోజులుగా నచ్చజెబుతూ వచ్చారు. పెద్ద కూతురు వినీల.. మూడు నెలల క్రితం ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోగా.. ఒ ప్పించి తీసుకొచ్చారు. కులాంతర వివాహం వద్దు అని తల్లిదండ్రులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
ఇష్టానుసారంగా తిరగవద్దు.. మంచిగా చదువు కోవాలని ఇద్దరు కూతుళ్లకు చెబుతూ వచ్చారు. అయినా వారిలో మార్పురాకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో వారిద్దరు మనస్తాపం చెందారు. ఈ క్రమంలో శనివారం తండ్రి ఆర్సీఐకి , తల్లి కిరాణా షాపుకు వెళ్లింది. దీంతో మ ధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో అక్కా చెల్లెళ్లు వెంటిలేటర్స్కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి షాపు నుంచి వచ్చి తలుపుకొట్టగా ఎంతకీ తీయలేదు. దీంతో స్థానికుల సహాయంతో చూడగా చనిపోయి ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కూతుళ్లు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.