Osmania University | సికింద్రాబాద్, మే25: వందేళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో తరగతి గదుల నిర్మాణానికి సహకరించడం తమ సంస్థకు ఎంతో గర్వకారణంగా ఉందని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. తెలంగాణలో విద్యారంగాన్ని ఆధునికీకరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సింగరేణి సంస్థ తెలంగాణ ప్రాంతంలో విద్యాభివృద్ధికి తన వంతు సహకారాన్ని ఎప్పుడూ అందిస్తూ వస్తోందని అన్నారు.
ఆదివారం ఉదయం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ శాఖలో దాదాపు రెండు కోట్ల రూపాయల సింగరేణి సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన తరగతి గదుల కాంప్లెక్స్ ను ఆయన యూనివర్సిటీ ఉప కులపతి కుమార్ మొలుగారంతో కలిసి ప్రారంభించారు. సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియాలో ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మైనింగ్ ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించడానికి కూడా పూర్తిస్థాయిలో సహకరించిందని, అలాగే ప్రస్తుత ఉస్మానియాలోని మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో సింగరేణి తరఫున అధ్యాపకులను కేటాయించిందని, ప్రొఫెసర్ ఛైర్ పథకం కింద నిధులు కూడా కేటాయించిన విషయాన్ని ఎన్.బలరామ్ గుర్తుచేశారు. ఇవే కాకుండా పెద్దపల్లి జిల్లాలో జేఎన్టీయూ కళాశాల ఏర్పాటుకు పూర్తి సహకారం అందించినట్లు తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఉప కులపతి కుమార్ మొగులారం మాట్లాడుతూ.. 13 దశాబ్దాల చరిత్ర గల సింగరేణి సంస్థ తెలంగాణ ప్రాంతానికి గర్వకారణమని, ఉస్మానియా యూనివర్సిటీకి సింగరేణి అందించిన ఆర్థిక సహాయం మరువలేనిదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మైనింగ్ బోధన తిరిగి ప్రారంభించేందుకు కూడా పూర్తి సహకారం అందించిందని కొనియాడారు. ఇకపై కూడా సింగరేణి తన సహకారం అందించాలని కోరారు.