Singareni | సింగరేణి భవన్, ఏప్రిల్ 23 : తీవ్ర కాలేయ వ్యాధి (లివర్ సిరోసిస్)తో బాధపడే కార్మికులకు సగం జీతంతో కూడిన ప్రత్యేక సెలవులను మంజూరు చేయాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
సగం జీతంతో కూడి ప్రత్యేక సెలవులను ఇప్పటివరకు కేవలం ఏడు తీవ్ర వ్యాధులకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. గుండె జబ్బు, క్షయ, క్యాన్సర్, కుష్టు, పక్షవాతం, మూత్ర కోశ వ్యాధులు, ఎయిడ్స్ , మెదడు సంబంధిత వ్యాధులకు ఈ స్పెషల్ లీవ్స్ ఇస్తున్నారు. కాగా ఇటీవల కోల్ ఇండియా స్థాయిలో జరిగిన ఎన్సీడబ్ల్యూఏ 11వ వేతన ఒప్పందంలో లివర్ సిరోసిస్ (తీవ్ర కాలేయ వ్యాధి) బాధితులకు కూడా స్పెషల్ లీవ్ వర్తింపచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తీవ్ర కాలేయ వ్యాధికి గురైన కార్మికులకు స్పెషల్ లీవు మంజూరు చేయవచ్చని, వ్యాధి నయమై, విధులకు ఫిట్ అయ్యేంతవరకు అతనికి 50 శాతం వేతన మొత్తం (బేసిక్ పే, వీడిఏ, ఎస్ డి ఏ లో 50 శాతం ) చెల్లించవచ్చని సర్క్యులర్ లో పేర్కొన్నారు.