Amberpet Mahankali Temple | అంబర్ పేట, జూలై 19 : అంబర్ పేట ప్రజల కొంగు బంగారం… అందరి కోర్కెలు తీర్చే మహంకాళి అమ్మవారి బోనాల రెండు రోజుల పాటు పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూలై 20, 21 తేదీలలో అంబర్పేటలో అంగరంగ వైభవంగా బోనాల జాతరను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అంబర్పేట దేవస్థాన సేవా సమితి ప్రతినిధులు అన్ని చర్యలు తీసుకున్నారు. జంటనగరాలలో బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకొనే దేవాలయాల్లో తృతీయ స్థానాన్ని దక్కించుకున్న అంబర్పేట మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆది, సోమ వారాలు ఆహ్లాదకర వాతావరణంలో జరుగనుంది.
జూలై 6 వ తేదిన ఘటం ఊరేగింపుతో ఈ బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 19వ తేది వరకు ఘటం అన్ని బస్తీలలో తిరిగింది. 20వ తేది ఆదివారం ఉదయం 4 గంటల నుంచి 6 వరకు అమ్మవారికి అభిషేకము జరుగుతుంది. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు అమ్మవారికి ధూపదీపనైవేద్యం(బోనాలు) సమర్పించుట జరుగుతుంది. జూలై 21వ తేది సోమవారం తెల్లవారు జామున 3 గంటల నుంచి అమ్మవారి ఎదుర్కోలు కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి నూతన వస్త్రాలు తెచ్చుట, ఒంటి గంటకు పచ్చికుండ స్థాపన, 2 గంటలకు ఏర్పుల విజయ్కుమార్చే భవిష్యవాణి(రంగం) కార్యక్రమం ఉంటుంది.
మధ్యాహ్నం 3 గంటలకు పోతరాజుల ప్రదక్షణ, సాయంత్రం 4 గంటలకు బలిగంప తీయుట, 6 గంటలకు అమ్మవారి సాగనంపు ఊరేగింపుతో బోనాల రెండు రోజుల జాతర పూర్తవుతుంది. ఊరేగింపు మంగళవాయిద్యాలు, డప్పు, కొమ్ము బృందాలు, బ్యాండ్ మేళాలతో, అష్టలక్ష్మీ దేవతల రూపాలతో, శివపార్వతి, కేరళ కళంకారి డ్యాన్సులతో పోతరాజుల విన్యాసాలతో అంగరంగ వైభవంగా సాగనుంది. ఇందులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈసారి అమ్మవారి దేవాలయం వద్ద విద్యుత్ అలంరణలతో కూడిన స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవస్థాన సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామన్నారు. పోలీసులు కూడా గట్టి భద్రత ఏర్పాట్లను చేశారు.
ఏడు దశాబ్దాల చరిత్ర
అంబర్ పేట మహంకాళి దేవాలయానికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. తెలంగాణ ఆచార వ్యవహారాలకు ఆటపట్టు అయినటువంటి అంబర్పేట గ్రామం జానపద కళారీతులు, సంస్కృతి, సాంప్రదాయాలకు అగ్రస్థానాన్ని సంపాదించింది. 1948లో ప్రజలు కలరా, ప్లేగు వ్యాధి వంటి అంటువ్యాధులు ప్రబలి అనేక మంది మృత్యువాత పడ్డారు. ఆ సమయంలో అమ్మవారికి బోనాల జాతర నిర్వహించారు. దాని తర్వాత వ్యాధులు ప్రబలడం తగ్గడంతో అమ్మవారి ఆలయాన్ని నిర్మించేందుకు గ్రామస్తులు పూనుకున్నారు. అప్పటి గ్రామ పాలన వ్యవస్థ అంబర్పేట దేవస్థాన సేవా సమితి అనే సంస్థను స్థాపించి 1950లో అంబర్పేట గ్రామం నడిబొడ్డున మహంకాళి దేవాలయ నిర్మాణాన్ని చేపట్టింది.
అమ్మవారి పంచలోహ విగ్రహం సింహ వాహినియై(అమ్మవారి సింహ వాహనం తల ఎడమ వైపునకు ఉండడం ప్రత్యేకత) ఖడ్గధారియై, రక్తపాత్ర చేత ధరించి ధర్మ సంరక్షణార్థం అవతరిస్తానంటూ ప్రతిజ్ఞ చేస్తున్న రీతిలో అమ్మవారి విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, పాదరసంతో యంత్ర ప్రతిష్టాపన చేసి, ఈ విగ్రహాన్ని 1953 సెప్టెంబర్ 3వ తేదిన ప్రతిష్టించారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా 72 సంవత్సరాలుగా బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 2004లో ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. స్థానికంగా ప్రతి ఇంటిలో ఏ శుభ కార్యం జరిగినా మొదట అమ్మవారిని దర్శించుకొన్న తర్వాతనే మొదలుపెడతారు.