బాలానగర్: బాలానగర్ (Balanagar) ఫ్లైఓవర్ పై ఓ గుర్తు తెలియని పాదచారుడని కారు ఢీ కొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందారు. ప్రమాద ఘటనను పంచనామా చేస్తున్న ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ (శిక్షణలో ఉన్న ఎస్ఐ) ఎస్.వెంకటేశంను డీసీఎం ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఎస్ఐ రెండు కాళ్లు విరిగిపోయాయి. అతడిని చికిత్స నిమిత్తం నగరంలోని యశోద దవాఖానకు తరలించారు. బాలానగర్ పోలీసులు, స్థానికులు కలిపిన వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3 .10 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి బాలానగర్ ఫ్లైఓవర్ నుంచి కూకట్పల్లి వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. బోయిన్పల్లి వైపు నుంచి వచ్చిన కారు (TS 08UE 1029) పాదాచారూడిని ఢీకొట్టింది. ఈ సంఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని ప్రయాణికులు బాలానగర్ పోలీసులకు సమాచారం అందించారు.
ప్రొబేషనరీ ఎస్ఐని ఢీకొట్టిన డీసీఎం
బాలనగర్ ఫ్లైఓవర్ పై జరిగిన ప్రమాదం సంఘటనను పంచనామా చేసేందుకు ప్రొబేషనరీ ఎస్ఐ ఎస్ వెంకటేశం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న ప్రొబేషనరీ ఎస్ఐ వెంకటేశంను బోయిన్పల్లి వైపు నుంచి వేగంగా దూసుకువచ్చిన డీసీఎం (TS 12UD3937) అతని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం నగరంలోని మాదాపూర్ యశోద ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ప్రొఫెషనల్ ఎస్సై వెంకటేష్‌ను బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, ఏసిపి నరేష్ రెడ్డి, బాలానగర్ సీఐ నరసింహారాజులు పరామర్శించారు.
ప్రొఫెషనరీ ముగిసింది.. పోస్టింగ్ వచ్చే సమయానికి ప్రమాదం
బాలానగర్ పోలీస్ స్టేషన్లో ప్రొబేషనరీ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎస్ వెంకటేశంకు జూన్ 30తో ఆరు నెలల ప్రొబేషనరీ కాలపరిమతి ముగిసింది. జులై నెలలో పోస్టింగ్ రానున్న నేపథ్యంలో ఈ ప్రమాదం సంభవించింది. అతడి పై ఎన్నో ఆశలు పెట్టుకొని వెంకటేశం కుటుంబ సభ్యులకు నిరాశ వచ్చి పడింది. ఇదిలా ఉండగా చికిత్సలో ఉన్న వెంకటేశంకు పోలీస్ ఉన్నతాధికారులు పోస్టింగ్ ఇస్తారా వెయిటింగ్ లో పెడతారా వేచి చూడాల్సిందే.