సిటీబ్యూరో, జనవరి 17(నమస్తే తెలంగాణ): రక్షణ కల్పించాల్సిన అధికారులే నేరాలకు పాల్పడడం, తన సర్వీసు రివాల్వర్‌ను నిర్లక్ష్యంగా పోగొట్టుకోవడం వంటివి హైదరాబాద్ సిటీ కమిషనరేట్ ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారాయి. ఒకవైపు రికవరీ సొత్తులో చేతివాటం చూపించడమే కాకుండా ఏకంగా తన వృత్తికే చిరునామాగా నిలిచే సర్వీస్ తుపాకీ విషయంలో ఎటూ తేల్చని పోలీసు అధికారి తీరుతో ఉన్నతాధికారులు సైతం ఈ కేసు ఇక తేలదంటూ గాలికి వదిలేశారా అంటూ ఆ శాఖలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
గత సంవత్సరం నవంబర్ చివరివారంలో వెలుగు చూసిన అంబర్‌పేట పాత ఎస్ఐ భా నుప్రకాశ్ రెడ్డి సర్వీస్ రివాల్వర్ మిస్సింగ్ వ్యవహారం మిస్టరీగానే మారిం ది. రివాల్వర్ పోయిందన్న విషయం వెలుగులోకి వచ్చి రెండునెలలైనా ఇప్పటికీ ఆ సంగతి తేలడం లేదు. పోలీసులు ఈ విషయంలో ఎన్నిసార్లు భానుప్రకాశ్‌రెడ్డిని ప్రశ్నించినా ఒక్కోసారి ఒక్కోలా సమాధానం చెప్పడంతో విచారణ ముందుకు సాగడం లేదని ఒక పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.
అంబర్‌పేటలో పనిచేసే సమయంలో తన రివాల్వర్ టేబుల్లో పెట్టి మరిచిపోయానని చెప్పడంతో మొదలైన ఎస్ఐ భానుప్రకాశ్‌రెడ్డి కథ చివరకు ఎక్కడ పెట్టానో మరిచిపోయాననే వరకు వచ్చింది. రివాల్వర్ మిస్సింగ్‌పై అతను ఒకసారి లాడ్జిలో మరిచిపోయానని, మరోసారి బస్సులో పోయిందని .. ఇలా పొంత న లేని సమాధానాలు చెప్పిన భానుప్రకాశ్ చివరకు రివాల్వర్ సంగతి తనకు తెలియదని, గుర్తులేదని, మీరే వెతికి తెచ్చుకోండంటూ పోలీసులకు చెప్పడంతో వారు నానాతిప్పలు పడుతున్నారు.
ఏకంగా డ్యూటీ లో తనతో పాటే ఉండాల్సిన సర్వీస్ రివాల్వర్ మిస్సింగ్‌పై భానుప్రకాశ్‌రెడ్డి చాలా తేలికగా మాట్లాడడం ఆ శాఖలో సీనియర్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని, అసలు రివాల్వర్ మిస్ అయిందంటే అది పెద్ద మచ్చగా చూస్తామని వారు అంటున్నారు. ఈ వ్యవహారాన్ని సాగదీయ కుండా రికవరీ బంగారం మాయం కేసులో భానుప్రకాశ్‌ను జైలుకు పంపిన ఉన్నతాధికారులు ఇక ఈ తుపాకీ సంగతి మరిచిపోయేలా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
అయితే రివాల్వర్‌ను బెట్టింగులో డబ్బుల కోసం ఎవరి వద్దనైనా తాకట్టు పెట్టారా అనే కోణంలో కూడా పోలీసుల విచారణ జరిగింది. ఆ ప్రశ్నలు అడిగినప్పుడు భా నుప్రకాశ్ చాలా తేలికగా మాట్లాడడంపై కొందరు పోలీసు అధికారులు రాయలసీమ జిల్లాల్లో ఈ వ్యవహారం జరిగి ఉండవచ్చని భావించారు. కానీ అక్కడ కూ డా వీరికి ఒక చిన్న క్లూ దొరకకుండా భానుప్రకాశ్ పకడ్బందీగా వ్యవహారం చేసినట్లు చెప్పుకుంటున్నారు.
పోలీసు అధికారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే రివాల్వర్ మిస్సింగ్‌పై ఆ శాఖలో ఉన్నతాధికారుల నుంచి పెద్దగా స్పందన లేదు. అసలు ఎప్పటికప్పుడు ప్రెస్మీట్లో కానీ, ఇతర సందర్భాల్లో ముఖ్య అధికారులతో ఈ వ్యవహారం గు రించి అడిగినప్పుడు లోకల్ పోలీసులు చూసుకుంటున్నారని, తప్పకుండా ట్రేసవుట్ చేస్తామని చె ప్పారే తప్ప ఇప్పటివరకు తుపాకీ ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారు.
విచారణలో భాగంగా సర్వీస్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకుందామని విజయవాడ మొదలు పలు ప్రాంతాల్లో తిరిగిన పోలీసులకు ఎక్కడా ఆ ఆనవాలు కూడా లభించలేదని తెలిసిం ది. ఈ నేపథ్యంలో కమిషనరేట్ నుంచి అన్ని జిల్లాలతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ర్టాలతో సహా పలు రాష్ర్టాలకు సమాచారం అందించారు. ఎక్కడైనా 9ఎంఎం సర్వీస్ రివాల్వర్ కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. భానుప్రకాశ్‌రెడ్డిపై బంగారం రికవరీలో సొమ్ములు వాడుకున్నారనే కేసు పెట్టి చంచల్‌గూడ జైలుకు పంపించినప్పటికీ సర్వీస్ రివాల్వర్ మిస్సింగ్ విషయంలో పోలీసుబాసులు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదన్న చర్చ పోలీసు శాఖలో జరుగుతోంది.
ఎటువంటి కేసునైనా క్షణాల్లో ఛేదించే హైదరాబాద్ పోలీసులు ఈ విషయంలో ఎందుకో వెనకడుగు వేస్తున్నారని ,సర్వీస్ రివాల్వర్ మాయం కావడమే కాకుండా ఈ వ్యవహారాన్ని చాలా తేలికగా తీసుకుంటున్న భానుప్రకాశ్‌ను వేరే కేసులో జైలుకు పంపించి తుపాకీ వ్యవహారాన్ని సైడ్ చేయడంపై ఆ శాఖలో కొందరు సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు