సిటీబ్యూరో: గ్రేటర్లో ప్రభుత్వ ఇంటర్ కాలేజీల విద్యార్థులు అధ్యాపకుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం సిలబస్లో 40 శాతం కూడా తరగతులు జరగడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత అవ్వడమే కత్తిమీద సాములా మారుతుందని తెలిపారు. ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో ప్రభుత్వ ఇంటర్ కాలేజీల నుంచి 42,562 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, కేవలం 48 శాతం మాత్రమే విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అది కూడా అరకొర మార్కులతో పాసవ్వడం ఆందోళన కలిగిస్తున్నదని విద్యా నిపుణులు చెబుతున్నారు.
మొత్తం 243 కాలేజీలు
గ్రేటర్ పరిధిలో మొత్తం 243 ప్రభుత్వ జూనియర్, ఒకేషనల్ కాలేజీలు నడుస్తున్నాయి. వీటి నిర్వహణ మాత్రం అధికారులు గాలికొదిలేశారు. ఫలితంగా సర్కార్ కాలేజీల్లో చదివే విద్యార్థులు విద్యలో వెనకంజలో ఉంటున్నారు. కాగా, ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు ఫస్ట్ ఇయర్, సెకెండ్ ఇయర్ కలుపుకొని ఇతర ఖర్చులతో సుమారు రూ. 2-4లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంత స్థోమత లేక తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు కాలేజీల్లో చేర్పిస్తున్నారు. కానీ సరిపడా లెక్చరర్లు లేక వారి భవిష్యత్ ప్రశ్నార్థకమవుతున్నది.
పలు కాలేజీలో ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లిష్తో పాటు ఎకనామిక్స్, కామర్స్, ఫిజిక్స్, బాటనీ పాఠాలను బోధించే వారు లేరని విద్యార్థులు చెబుతున్నారు. ఒకేషనల్ కోర్సుల్లోనూ ఇదే దుస్థితి. ఏటా 40 శాతం వరకు కూడా క్లాస్లు జరగడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమైన రెండు నెలల్లోపు ఖాళీలు ఉన్న చోట గెస్ట్ లెక్చరర్లను తీసుకుని బోధన ప్రక్రియను ప్రారంభించాల్సి ఉండగా ఆ దిశగా అడుగులు వేయడం లేదు. అక్టోబర్ మొదటి వారం వరకు కూడా నియామకాలు జరగకపోవడంతో బోధన అంతంత మాత్రంగానే సాగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.