సిటీబ్యూరో, జులై 25 (నమస్తే తెలంగాణ) : నగర ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించడంలో ఆర్టీసీ విఫలమవుతున్నది. బస్సు పాసుల ధరలు పెంచి భారం మోపిన ఆర్టీసీ ఇప్పటికీ ప్రయాణికుల డిమాండ్లను మాత్రం పట్టించుకోవడం లేదు. నగరంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా బస్సుల సంఖ్య పెంచాలని ప్రజల నుంచి బలంగా డిమాండ్ ఉన్నా ఇప్పటికీ ఆ దిశగా అధికారులు అడుగులు వేయడం లేదు.
దీనికి తోడు వర్షాకాలం కావడంతో గ్రేటర్లో సరిపడా బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు బస్సుల కోసం ఎదురుచూస్తూ తడవాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఉదయం, రాత్రిపూట రావాల్సిన బస్సులు సమయానికి రాకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు తమ గమ్య స్థానాలకు చేరుకోవడానికి నానా యాతన పడాల్సి వస్తుంది. ఆర్టీసీ ప్రయాణం అంటే ఓ నరకమనే భావన కలిగేలా ఉందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా గ్రేటర్లో 7 వేల బస్సులు అవసరం ఉందని రవాణా రంగ నిపుణులు ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించారు. అయితే ప్రస్తుతం నగరంలో 2800 బస్సులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రతీ రోజు 24 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. నగరంలో ప్రయాణికులకు సరిపడా బస్సు షెల్టర్లు లేవు. కేవలం వాణిజ్య ప్రకటనలు వచ్చే అవకాశం ఉన్న చోట మాత్రమే ఆర్టీసీ అధికారులు షెల్టర్ల ఏర్పాటను వేగవంతం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం 1370 బస్షెల్టర్లు మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్య పెంచాలని మరో 400కు పైగా కొత్త షెల్టర్లు నిర్మాణం అవసరం ఉందని ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం భావించింది. వర్షాకాలం రాబోతుందని.. 120 షెల్టర్లు నిర్మాణం పూర్తి చేయాలని కూడా ఉంది. కానీ అత్యవసరంగా నిర్మించాల్సిన ఆ షెల్టర్లను కూడా ఆర్టీసీ విస్మరించింది. ఇది ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ఈ వర్షాకాలం అంతా ప్రయాణికులు వర్షంలో తడవాల్సిన ప్రయాణికుల కష్టాలు పట్టని ఆర్టీసీ కేవలం డబ్బులు రాబట్టడమే పరమావధిగా భావిస్తున్నది. ఇప్పటికే స్లూడెంట్ బస్సు పాస్ ఛార్జీల పెంచి చుక్కలు చూపించారు. ఇటీవల టీ-24 బస్సు పాస్ ధరలను సైతం పెంచి ప్రయాణికులకు షాకిచ్చారు.
టీ-24 బస్సు పాస్లో జనరల్ పాస్ 120 రూపాయలు ఉంటే 150 చేశారు. సీనియర్ సిటిజన్స్ పాత ఛార్జీ 100 ఉంటే 120 చేశారు. మహిళలు(ఆధార్ లేనివారు) 100 ఉంటే 120 చేశారు. పిల్లలు రూ.80 ఉంటే 100 చేశారు. దీంతో పాటు విద్యార్థుల నెలవారి పాస్ ధరలను సైతం పెంచారు. గతంలో రూ.400 ఉంటే ఇప్పుడు 600 వసూలు చేస్తున్నారు. ఆర్డినరీ రూ.1150 ఉంటే 1400 చేశారు. మెట్రో బస్ పాస్ రూ.1300 ఉంటే రూ.1600 చేశారు. మెట్రో డీలక్స్ బస్ పాస్ రూ.1450 ఉంటే రూ.1800 చేసి ప్రయాణికులపై భారం మోపారు. నగరంలో బస్సు పాస్ వినియోగదారులు 2.7 లక్షలు ఉన్నారు. వీరందరిపై భారం పడింది. బస్సు పాస్ ధరలను తగ్గించి, బస్సుల సంఖ్యను పెంచాలని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.