హైదరాబాద్( కేపీహెచ్బీ కాలనీ) : కూకట్పల్లికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆ పార్టీలను వీడుతూ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఆయా పార్టీలకు చెందిన సీనియర్ నేతలంతా బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారు.
మంత్రి కేటీఆర్(Minister KTR), కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Mla Krishna Rao)ల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఏనుగుల తిరుపతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో మంగళవారం చేరారు. బీజేపీ(BJP) మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రటరీ అన్వర్, సెక్రటరీ దేవేందర్, అర్బత్, నియామత్, ఫరీద్, ఫతేనగర్ డివిజన్ జనరల్ సెక్రటరీ ఇబ్రహీం లతో పాటు వందమంది కాంగ్రెస్, బీజేపీ నేతలు బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత రీతిలో అభివృద్ధిని సాధించిందని, పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలపై ప్రజలకు నమ్మకం లేక బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు. కూకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును భారీ మెజార్టీతో గెలిపించేందుకు పనిచేస్తామని తెలిపారు.