శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 20: రేడియల్ రోడ్డులో భూములు, ప్ల్లాట్లు కోల్పోతున్న వారికి… భూమికి భూమి ప్లాటుకు ప్లాటు ఇస్తేనే భూసేకరణకు సహకరిస్తామని కొత్వాల్‌గూడ గ్రామస్తులు, బాధితులు స్పష్టం చేశారు. గురువారం శంషాబాద్ మండలంలోని కొత్వాల్‌గూడ గ్రామంలో రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు, బాధితులు మాట్లాడుతూ.. గతంలో ఔటర్‌రింగ్ రోడ్డుకు సైతం మా గ్రామంలో భారీ ఎత్తున భూములు కోల్పోయామని తెలిపారు. దీంతో పాటు కొత్వాల్‌గూడ రెవెన్యూ పరిధిలోని ఎన్వేకి సంబంధించిన భూములుగా పేర్కొంటూ అధికారులు తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్వాల్‌గూడలోని భూములు కబ్జాలలో ఉన్నవారికి ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15సంవత్సరాల క్రితం వరకు కొత్వాల్‌గూడ గ్రామంలోని భూములకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకోవడంతో పాటు రైతులు వారి అవసరాల కోసం అమ్ముకునేవారు. కాని అప్పటి నుంచి ఇక్కడ అమ్ముకాలు జరగడంలేదని పేర్కొన్నారు. కోత్వాల్‌గూడ గ్రామంలోని రైతులకు న్యాయం చేయాలని కోరారు.
బలవంతపు భూ సేకరణకు ఒప్పుకునేదిలేదు..
రేడియల్ రోడ్డులో భూములు కోల్పోతున్న వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. కొత్వాల్‌గూడ గ్రామ సభలో అధికారులకు తమ డిమాండ్లను ఒప్పుకోకపోతే రోడ్డు పనులు అడ్డుకుంటామని వారు స్పష్టం చేశారు. గ్రామసభలో జరిగిన ప్రతి అంశం ఉన్నతాధికారులకు నివేదక పంపించాలని అధికారులను కోరారు. బలవంతంగా భూములు తీసుకుంటే ఊరుకునేదిలేని హెచ్చరించారు. అనంతరం ఆర్డ్టీవో వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామసభలో వచ్చిన నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని అన్నారు. ఎన్వేకి సంబంధించిన భూములతో పాటు సీలింగ్ భూములపై ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. కొత్వాల్‌గూడ గ్రామ రైతులకు రేడియల్ రోడ్డు భూసేకరణలో న్యాయమైన పరిహారం అందేలా చూస్తామని తెలిపారు. ఎవరికీ అన్యాయం జరగనీయమన్నారు. సమావేశంలో తహసీల్దార్ రవీందర్దత్, కొత్వాల్‌గూడ గ్రామస్తులు, బాధితులు పాల్గొన్నారు.