మియాపూర్ : చెరువుల సుందరీకరణ, పరిరక్షణపై హైడ్రాకు చిత్తశుద్ధి లోపించిందని పీఏసీ ఛైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ విమర్శించారు. చెరువు పరిరక్షణ కోసం హైడ్రా సెక్యూరిటీ సిబ్బందిని నియమించినప్పటికీ నియోజకవర్గంలోనే అతి పెద్దదైన గంగారం చెరువులో ఐదు ఎకరాలలో మట్టి నింపారని ఆరోపించారు. తాను పూర్తిస్థాయి సమాచారంతో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని చెప్పారు. ఈ తతంగం చూస్తుంటే హైడ్రా సెక్యూరిటీ సిబ్బంది చెరువులో మట్టి నింపేందుకు పరోక్షంగా సహకరిస్తున్నట్లు అనుమానం కలుగుతుందన్నారు.
చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ఓవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెబుతుంటే ఆ విభాగం సిబ్బంది ఇలా విలువైన చెరువు స్థలాలను అన్యాక్రాంతం అయ్యేలా వ్యవహరిస్తుండటం సరైనది కాదన్నారు. రాజకీయాల కోసం తాను మాట్లాడటం లేదని, తనకు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యమని గాంధీ చెప్పారు. చెరువుల పరిరక్షణకు నియోజకవర్గ ప్రతినిధిగా తాను కృషి చేస్తూ, పలు సంస్థలను సుందరీకరణకు చైతన్యపరిచి ముందుకు తీసుకువస్తుంటే, పరిరక్షణ బాధ్యతలు తీసుకోవాల్సిన హైడ్రా సిబ్బందే ఇలా పరోక్షంగా స్థలాల ఆక్రమణకు సహకరిస్తుండడం హైడ్రాకు చెరువుల పరిరక్షణపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో తేటతెల్లం చేస్తోందని ఆరోపించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలో పటేల్ కుంట చెరువు సుందరీకరణ పనులను కార్పొరేటర్ శ్రీకాంత్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. గంగారం చెరువులో మట్టి నింపే విషయమై హైడ్రా సెక్యూరిటీ సిబ్బందిపై తాను పూర్తి సమాచారంతోనే ఈ విషయాలను బహిరంగంగా వెల్లడిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తాను సమాచారం లేకుండా ఈ విషయంపై ఆరోపణలు చేయడం లేదని పేర్కొన్నారు. చెరువులలో వ్యర్ధాలను నింపే వ్యక్తులపై నిఘా ఉంచి తమకు సమాచారం అందించాలని, వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేయిస్తామని చెప్పారు.