Bakrid | బండ్లగూడ, మే 31 : బక్రీద్ పండుగ వచ్చిందంటే చాలు నగరంలోని రోడ్లపై గొర్రెలు, మేకల అమ్మకాలు జోరుగా కనిపిస్తుంటాయి. ముస్లింలు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే పండుగలో బక్రీద్ ఒకటి. బక్రీద్ పండగను దృష్టిలో ఉంచుకుని ఓ వ్యాపారస్తుడు వినూత్నంగా గొర్రెలను అమ్ముకునేందుకు వీలు కల్పిస్తున్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా నగర శివారు ప్రాంతంలో షేడ్లను ఏర్పాటు చేశారు. గొర్రెల ఫాం చేసే రైతులు నేరుగా ఇక్కడ అమ్మకాలు చేసుకొవచ్చు. ఇందుకోసం అవసరమైన పనులను పూర్తి చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన మహ్మద్ ఫాజులుల్, ఖలీద్‌లు వచ్చే నెల 6వ తేదీన బక్రీద్ పండగ సందర్బంగా నగర శివారు ప్రాంతమైన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దర్గా ఖలీజ్ఖాన్లో గొర్రెల షేడ్లను ఏర్పాటు చేసి అక్కడ నుంచి వాటిని అమ్మకాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాదు ఇక్కడ అవసరమైన వారికి మాంసంను కట్ చేసి ఇచ్చేందుకు ఇతర షేడ్లను కూడ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చేందిన గొర్రెల ఫాం రైతులు నేరుగా ఇక్కడకు తీసుకువచ్చి అమ్ముకోవచ్చని నిర్వహకులు తెలిపారు. ఇందు కోసం ఒక్కోక్క ఫాం రైతు నుంచి రూ. 18 వేలు వసూలు చేసి వారికి పది రోజుల వరకు అవసరమైన వసతులను కల్పిస్తున్నారు.
ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా..
బక్రీద్ పండగా వచ్చిందంటే చాలు రోడ్లపై గొర్రెలు, మేకల అమ్మకాలతో నగరం అంత కిక్కిరిసి పోతుంది. దీంతో ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఫాజులుల్, ఖలీద్‌లు నగర శివారు ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తాము శివారు ప్రాంతాలలో షేడ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీని వల్ల గోర్రెల ఫాం రైతులు అవుటర్ రింగ్‌రోడ్డు మార్గంలో వచ్చి ఇక్కడ గోర్రెలను అమ్మునేందుకు వీలు కల్పించామని తెలిపారు.