Hyderabad | మాదాపూర్ కావూరి హిల్స్ ఫేజ్- 2 రోడ్డులో దాదాపు 1000 గజాల స్థలం.. ఇందులో ఓ వ్యాపారి జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్ వ్యాపారానికి సిద్ధమై ఇందుకు సంబంధించి భారీ షెడ్డ్డు నిర్మాణం చేపట్టాడు. అక్రమ నిర్మాణమని తెలుసుకుని స్థానిక శేరిలింగంపల్లి సర్కిల్‌కు చెందిన చైన్‌మెన్ (ప్లానింగ్ విభాగం ఉద్యోగి) ఆ స్థలం వద్దకు ఈ నెల 14న చేరుకున్నాడు. ఈ నిర్మాణం అక్రమం.. కూల్చేస్తానంటూ తన వెంట తెచ్చుకున్న జేసీబీతో హల్చల్ చేశాడు. అడిగినంత ఇస్తే ఒకే.. లేదంటే చుక్కలు చూపిస్తానంటూ నిర్మాణదారుడిని బెదిరించాడు.
‘నిర్మాణం జోలికి రావొద్దంటే రూ. 30 లక్షలు ఇవ్వాలి.. ఏసీపీ నుంచి సీపీ, జెడ్సీ వరకు మీ జోలికి రారు.. నాకు ‘బిగ్ బ్రదర్స్’ అండదండలు ఉన్నాయి’ అంటూ సదరు నిర్మాణదారుడికి హుకుం జారీ చేశాడు. ఈ క్రమంలో నిర్మాణదారుడితో రూ. 10 లక్షల బేరం కుదరడంతో ఇప్పటి వరకు అటు వైపు జేసీబీలు వెళ్లలేదు. ఇక్కడ విశేషమేమిటంటే సదరు చైన్‌మెన్ వెనుక బిగ్ బ్రదర్స్ ఉన్నారా? లేక తానే చెప్పుకుని దందాలకు తెరలేపాడా? చైన్‌మెన్ నుంచి ఏసీపీ, సీపీ, జేడ్సీలకు వాటాలు వెళ్తున్నాయా? అన్నది తేలాల్సి ఉంది.
ఇదే సర్కిల్లో మరో చైన్‌మెన్ రాయదుర్గంలో 90 గజాల స్థలంలో చేపడుతున్న ఓ యజమాని నుంచి అదనపు ఫ్లోర్ ఉందంటూ రూ. లక్షకు పైగా ముక్కుపిండి వసూలు చేశాడు. ఇలా ఒక్క శేరిలింగంపల్లిలోనే కాదు జీహెచ్ఎంసీ ప్లానింగ్ విభాగంలో అవినీతి హద్దులు దాటుతున్నది. కొందరు అధికారులు, సిబ్బంది బరితెగించి వసూళ్లకు పాల్పడుతున్నారు. వివాదాస్పద భూములు, న్యాయస్థానాల్లో ఉన్న వాటికి కూడా ‘డోంట్ కేర్’ అంటున్నారు. డబ్బులు ముడితే అవినీతి దందాలో తగ్గేదేలే అంటున్నారు. కాసులు కొట్టు-అక్రమం సక్రమం చేసుకో అన్నట్లు దందా నడుస్తున్నది.
-సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ)
శేరిలింగంపల్లి సర్కిల్లో సదరు చైన్‌మెన్ గీసిన‘లక్ష్మణ’రేఖ ఫైనల్…లేదంటే ఈ చైన్‌మెన్ బెదిరింపులకు నిర్మాణదారులు అయ్యో ‘నారాయణ’ అనాల్సిందే.గతంలో కూకట్‌పల్లిలో డీసీ వద్ద అటెండర్‌గా పనిచేసిన సదరు చైన్‌మెన్ అడ్డదారిలో డిప్యుటేషన్‌పై టౌన్‌ప్లానింగ్ విభాగంలోకి వచ్చాడు. గడిచిన పదేండ్లకు పైబడి శేరిలింగంపల్లి టౌన్‌ప్లానింగ్‌లో చైన్‌మెన్‌గా చెలామణి అవుతున్నాడు. ఇటీవల కాలంలో ఈ సర్కిల్లో టౌన్ ప్లానింగ్ ముఖ్య అధికారులు ఎవ్వరూ లేకపోవడంతో ఒక్కడే అన్నీ తానై రెచ్చిపోయాడు. రాఘవేంద్ర కాలనీ, రాజరాజేశ్వరీ నగర్, అంజయ్య నగర్, సిద్ధిఖ్నగర్లో ఈ చైన్మెన్కు భారీగానే బాధితులు ముడుపులు సమర్పించుకున్న వారే.
అక్రమాలు అరికట్టేందుకు ఆన్లైన్ విధానం (టీజీ బీపాస్) అమల్లోకి తెచ్చినా టౌన్‌ప్లానింగ్ అధికారుల ఆమ్యామ్యాలు మాత్రం ఆగడం లేదు. అర్జీ పెట్టుకోవడమే ఆలస్యం..అడిగినంత ఇవ్వాల్సిందేనని ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ముడుపులు ముట్టచెబితే చాలు..నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. అంతేకాకుండా అక్రమ నిర్మాణాల ఏరివేత పేరిట నోటీసులు జారీ చేస్తూ ముడుపులు అందుకున్న నిర్మాణాల జోలికి వెళ్లడం లేదు.
కొందరు ఏపీసీలు స్వతహాగా ప్రైవేట్ వ్యక్తులను ఏర్పరచుకుని అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారుల నిఘా లేకపోవడంతో ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందన్న విమర్శలు లేకపోలేదు. ఏసీపీల మాదిరిగానే ఏండ్ల తరబడి పాతుకుపోయిన చైన్మెన్లు, టీపీఎస్‌ల సమూల ప్రక్షాళన చేయాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కాగా, శేరిలింగంపల్లి సర్కిల్ చైన్మెన్ల దందాలపై స్థానిక ఏసీపీ వెంకట రమణను ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి ఫోన్లో వివరణ కోరే ప్రయత్నం చేయగా…ఆయన స్పందించలేదు.