సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): డిగ్రీ చదువుతున్న ఆనంద్ బస్‌స్టాప్‌లో మహిళలను వేధిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా షీ టీమ్స్‌కు పట్టుబడ్డాడు. అతడిని కోర్టులో హాజరు పరుచగా.. న్యాయస్థానం శిక్ష విధించింది. మరోసారి ఇలాంటి తప్పులు చేయవద్దని నిర్ణయించుకున్న ఆనంద్ సిన్సియర్‌గా జీవితం సాగిస్తూ డిగ్రీ పూర్తికాగానే ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అతడి ప్రొఫైల్ చూసిన ఓ సంస్థ ప్రతినిధులు.. అతడి బ్యాగ్రౌండ్‌పై ఆరా తీయడంతో ఏడాది కిందట షీ టీమ్స్ నమోదు చేసిన కేసు విషయం తెలిసింది. మీలాంటి వాళ్లకు ఉద్యోగం ఇవ్వలేం.. అంటూ సదరు సంస్థ నిర్వాహకులు తేల్చి చెప్పారు. నేను చేసిన తప్పేంటీ అంటూ ఆనంద్ తనలో తానే మదనపడ్డాడు. క్షణికావేశంలో మహిళలను వేధించడంతో తన జీవితంలో అది మాయని మచ్చగా మిగిలి భవిష్యత్తుపై ప్రభావం చూపిందంటూ ఆవేదన చెందుతున్నాడు. మహిళలను వేధించే ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
వేధింపులపై సీరియస్..
మహిళలను వేధించే వారిపై షీ టీమ్స్ కఠినంగా వ్యవహరిస్తున్నాయి. బస్‌స్టాప్‌లు, బస్సులు, మెట్రో, విద్యా, వాణిజ్య కేంద్రాలు, రద్దీగా ఉండే ప్రాంతాలు, పండుగలు, వేడుకల సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వారిపై షీటీమ్స్ నిరంతరం నిఘా పెడుతున్నాయి. యువతీయువకులు చదువు, ఉద్యోగం చేసే సమయంలో స్నేహంగా తిరుగుతూ ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. ఇలాంటి వారి మధ్య మనస్పర్థలు, వివాదాలు వచ్చి దూరమైన తర్వాత, వారిలో మొదలైన కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా ఆయా ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిలింగ్‌కు దిగుతుంటారు. సోషల్ మీడియాలో పరిచయాలు చేసుకొని, ఆ తర్వాత వేధింపులు చేసే వారు ఇంకొందరు ఉన్నారు. మహిళలను వివిధ రకాలుగా యువకులు వేధిస్తుంటారు. అయితే, చిన్న చిన్న విషయాలు.. బయటకు తెలిస్తే పరువు పోతుందని కొందరు బ్లాక్ మెయిలింగ్‌లకు లొంగిపోతుంటారు. మరికొందరు ఏం చేస్తావో చేసుకో.. అంటూ ధైర్యంగా హెచ్చరిస్తున్నారు. సమస్య చిన్నదే కదా.. అని ఎవరికీ చెప్పకుండా ఉంటూ.. బ్లాక్ మెయిలర్స్ చేసే డిమాండ్లకు తలొగ్గుతూ కొంతమంది బాధితులు నెమ్మదిగా ఊబిలోకి జారుకుంటారు. ఆ తర్వాత బయటకు రాలేక సమస్యల సుడిగుండంలో మునిగిపోతున్నారు. ఇలాగే. వివిధ రకాల వేధింపులకు గురవుతున్న చాలా మంది బాధితులు.. పోలీసులకు చెబితే ఏమవుతుందో..! ఇంట్లో తెలుస్తుందేమో..! అన్న ఆందోళనలో ఉంటారు. సమస్య చిన్నదైనా పెద్దగా ఆలోచించి, షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయాలి. షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేస్తే.. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచి నేరగాళ్ల నుంచి రక్షిస్తున్నారు.
ఒక్క క్షణం ఆలోచించండి..
మహిళలను వేధించే వారు తస్మాత్ జాగ్రత్త. మహిళలను వేధిస్తే షీ టీమ్స్ వెంటపడుతుంది. షీ టీమ్స్‌కు పట్టుబడితే పోలీసు కేసు నమోదవుతుంది. భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. షీ టీమ్స్‌కు పట్టుబడి జైలుకు వెళితే పోలీసు రికార్డుల్లోకి ఎక్కుతారు. పోలీసు రికార్డు ఉండటంతో ఉద్యోగాలు రావు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం ఉండదు. మహిళలను వేధిస్తే కటకటాల్లోకి వెళ్లడమే కాకుండా.. బంగారు భవిష్యత్తు అంధకారమవుతుంది..అని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.