సిటీ బ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): నకిలీ మెయిల్ ఐడీ సృష్టించి ఓ మహిళ షేర్లను బదిలీ చేసుకుని, ఖాతాను దుర్వినియోగం చేసిన ఇద్దరు కేటుగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ తండ్రి మరణించడంతో ఆయన డీమ్యాట్ ఖాతాలోని షేర్లు క్లెయిమ్ కాలేదు. దీంతో వాటిని తిరిగి పొందేందుకు సహాయం చేస్తానని వారసిగూడకు చెందిన లక్ష్మీదీపక్ ఆమెను నమ్మించాడు. 2014లో ఆమెతో ఆదిత్యా బిర్లా మనీ లిమిటెడ్‌లో డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా తెరిపించాడు. ఈ క్రమంలో ఆమె ఫోన్ ద్వారా నకిలీ ఈ-మెయిల్ సృష్టించాడు.
ఆ నకిలీ మెయిల్ ద్వారా ఆమె ఖాతా నుంచి షేర్లను బదిలీ చేసుకున్నాడు. మోసపోయానని తెలుసుకు న్న మహిళ 2018లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు ఆ నకిలీ ఈ-మెయిల్ తార్నాకకు చెందిన రాగు శ్రవణ్‌కుమార్ పేరిట ఉన్న ట్లు గుర్తించారు. లక్ష్మీ దీపక్, శ్రవణ్‌లు కలిసి బాధితురాలి నుంచి షేర్లు, నగదు కొట్టేయడానికి ప్లాన్ చేసినట్లు నిర్ధారించారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి ఏడో అడిషినల్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా.. ఆరు నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు. కేసు ను ఛేదించిన ఇన్స్పెక్టర్ గంగాధర్, సైబర్ క్రైమ్ ఏసీపీ ఆర్జీ శివ మారుతీ, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు శ్రీశైలం, నర్సింగ్ రావు, రాజగోపాల్, మహ్మద్ మహబూబ్ అలీఖాన్‌ను డీసీపీ అభినందించారు.