బండ్లగూడ,జనవరి 11: ఒరిస్సా కేంద్రం గా హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని శంషాబాద్ జోన్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను సూపరింటెండెంట్ సత్యనారాయణ వెల్లడించారు. ఒరిస్సా మల్కాన్గిరికి చెందిన హరిశంకర్ గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్‌లో ఉంటూ సెంట్రింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో హరిశంకర్‌కు లంగర్‌హౌజ్‌కు చెందిన మహేశ్‌కుమార్, హైదర్షాకోట్కు చెందిన వరుణ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది.కాగా హరిశంకర్ గంజా యి అమ్మకం ద్వారా డబ్బులు సులువుగా సంపాదించాలనే కోరికతో తన ఇద్దరి స్నేహితులతో కలిసి గంజాయి అమ్మేందుకు ప్రణాళిక వేశాడు.
గత కొంత కాలంగా వారు గంజాయిని నగర శివారు ప్రాంతమైన లంగర్‌హౌజ్,బండ్లగూడ,నార్సింగి తదితర ప్రాంతాల్లో యువతకు అమ్మి సొమ్ము చేసుకునేవారు.ఈ క్రమంలో వారు రెండు బైక్‌లలోని సీట్లను తొలగించి అందులో గంజాయి ప్యాకెట్లను నింపుకుని ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.గురువారం శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు పోలీస్ అకాడమీ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు.హరిశంకర్ తన బైక్‌పై వస్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు.పోలీసులు వెంబడించి పట్టుకుని విచారించగా అసలు విషయం తెలిసింది.వారి నుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.దీని విలువ రూ.3లక్షల వరకు ఉంటుందన్నారు. వీరిపై మరిన్ని కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.